న్యూఢిల్లీ : ముంబైలో ఓ మహిళకు కొవిడ్ కొత్త వేరియంటు ఎక్స్‌ఇ సోకినట్లు పూర్తిస్థాయిలో నిర్థారణ కాలేదు. దీనిని ఇంకా తాము పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకూ జరిపిన శాస్త్రీయ పరీక్షలలో ఇది ఎక్స్‌ఇ వేరియంటు కొవిడ్ అని చెప్పడానికి వీల్లేదని దేశంలో కరోనా జీనమ్ పరీక్షల సమాఖ్య అయిన ఇన్సాకాగ్ బుధవారం తెలిపింది. ముంబైలో ఓ చోట ఎక్స్‌ఇ, మరో చోట కప్పా వేరియంటును నిర్థారించినట్లు బుధవారం స్థానిక పురపాలక అధికారి ఒకరు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి ఫిబ్రవరి చివరిలో వచ్చిన మహిళకు ముంబైలో పరీక్షలు జరపగా ఆమెకు ఎక్స్‌ఇ వేరియంటు ఉన్నట్లు తేలిందని స్థానిక అధికారులు తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా నిర్థారణ అయితేనే ఇది ఏ రకం వేరియంటు అనేది వెల్లడవుతుందని ఇన్సాకాగ్ తెలిపింది. ఎక్స్‌ఇ వేరియంట్ల జన్యుక్రమంతో కొవిడ్ వచ్చినట్లు నిర్థారణ అయిన మహిళ వైరస్‌ను పరిశీలించారు. ఎక్స్‌ఇ సోకినట్లు నిర్థారణ కాలేదు అని ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. ఇక కప్పా వేరియంటు ముంబైలో జరిపిన సీరం పరీక్షల దశలో నిర్థారణ అయింది. ముంబైలో జరిపిన 230 శాంపుల్స్ సర్వేలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులే కనుగొన్నారు. ఈ కేసులు మునుపటి కరోనా వైరస్‌తో పోలిస్తే ప్రమాదకరమైనవి కావని స్పష్టం అయింది.