Monday, January 20, 2025

ఆ మియా ఓట్లు అవసరం లేదు: హిమంత బిస్వా శర్మ

- Advertisement -
- Advertisement -

గువహతి : తాను మియా ఓట్లను ఆశించడం లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ విధంగా బిజెపికి చెందిన ఈ సిఎం తన ముస్లిం వ్యతిరేకతను చాటుకున్నారు. శనివారం స్థానికంగా మీడియాతో ఆయన మాట్లాడారు. అసోంలో ఉంటున్న బెంగాలీ ముస్లింలను ఉద్ధేశించి తరచూ మియాలనే పదం వాడుతూ ఉంటారు. మియాలతో తనకు పనిలేదని, వారి ఓట్లు తనకు అవసరం లేదని తెలిపిన సిఎం తాను మియా ముస్లింలు ఎక్కువగా ఉండే మెడికల్ కాలేజీలను కూడా ఎక్కువగా సందర్ధించబోనని చెప్పారు. పలు ఆసుపత్రులలో మియాలు ఎక్కువగా పనిచేస్తున్నారని , దీనితో తనకు తాను ఆంక్షలు విధించుకున్నానని వివరించారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లింల కంటే తమ పార్టీ ఎక్కువగా రాష్ట్రంలోని స్థానిక ముస్లింల బాగోగులకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వారి స్థితిగతులను మార్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

తనకు మియాల ఓట్లు అవసరం లేదని, ఇక్కడి ముస్లింల మద్దతు ఉంటే చాలునని ప్రకటించారు. అసోంలోని పలు మెడికల్ కాలేజీలలో ఈ మియా ముస్లింలే ఉండటం తనకు బాధాకర విషయం అయిందన్నారు. చాలా మంది వచ్చి చేరారని తెలిసి, వాటి జోలికి వెళ్లడం లేదన్నారు. కాంగ్రెస్, ఎఐయుడిఎఫ్‌లు ముస్లింలతో ఓట్ల బంధం పెనవేసుకుని ఉందని, తమకు ఈ అవసరం లేదని తేల్చిచెప్పారు. అయినా ముస్లింల కోసం కాంగ్రెస్, ఇతర పార్టీలూ చేసిందేమి లేదని, కేవలం వారిని ఏదో విధంగా భయాందోళనలలోకి నెట్టి తమ పబ్బం గడిపే రివాజు కాంగ్రెస్‌ది అని విమర్శించారు. ఇక్కడి ముస్లిం వర్గాల ప్రయోజనాల కోసంపలు పనులు చేపట్టనట్లు తెలిపారు. మియా ముస్లింలు తమకు అవసరం లేదని సిఎంపేర్కొనడంపై అసోం కేంద్రీకృత ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు , ధుబ్రి ఎంపి మౌలానా బద్రుద్దిన్ అజ్మల్ తీవ్రస్థాయిలో స్పందించారు. మియా ముస్లింలు పనిచేయకపోతే గువహతి ఏడారి అవుతుందన్నారు. ఇక్కడ కేవలం మూడు రోజులు వీరు విధుల్లోకి రాకపోతే గువహతి శ్మశానం అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News