ఇదివరకటి తీర్పులను తిరిగి తోడనీయరాదని సూచన
న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ కులాలు, తెగల ఉద్యోగులకు ప్రొమోషన్లలో రిజర్వేషన్ కల్పించే విషయంలో ఇదివరకు తామిచ్చిన తీర్పును మళ్లీ పరిశీలించేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును ఏ విధంగా అమలు చేయాలో నిర్ణయించుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వాలేనని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఎస్సి, ఎస్టిల ప్రొమోషన్లలో రిజర్వేషన్ అమలుకు వివిధ అడ్డంకులు ఎదురౌతున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సందర్భంగా మంగళవారం సుప్రీం కోర్టు తన వైఖరిని స్పష్టం చేసింది. జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వం లోని ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం నాగరాజు కేసును కానీ, జర్నయిల్ సింగ్ కేసును కానీ తిరిగి పరిశీలించబోమని పేర్కొంది. కోర్టు విధించిన నిబంధనల ప్రకారం ఈ కేసుల్లో నిర్ణయిలు తీసుకోవాలనేదే ఆలోచన అని తెలియచేసింది.
ఈ విషయమై ఆయా రాష్ట్రాల రికార్డులను పరిశీలించి ఈ అంశాలను గుర్తించి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తనకు ఎదురైన సమస్యలను క్రోడీకరిస్తే ఈ కేసులో తదుపరి చర్యలకు కోర్టుకు అవకాశం కలుగుతుందని తెలియచేసింది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వెల్లడిస్తున్న సమస్యలు, ఇతరులు ప్రచారం చేస్తున్న సమస్యలు ఈ కేసుల పరిధులను విస్తరిస్తున్నాయని పేర్కొంది. అలా చేయడానికి తమకు ఇష్టం లేదని తెలిపింది. నాగరాజు కేసులో తుది నిర్ణయం ప్రకటించిన అంశాలపై మరోసారి పరిశీలించబోమని తెలిపింది. కేసుల రీఓపెనింగ్ కోసం వాదనలను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఏయే గ్రూపులు వెనుకబడిన వర్గాలకు చెందినవో నిర్ణయించాల్సింది రాష్ట్రాలేనని, ఆ నిర్ణయం ఎలా ఉండాలో సుప్రీం కోర్టు గత తీర్పుల్లో సూచించడమైందని సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ వాదించారు.