Sunday, December 22, 2024

బిసిలకు అధిక సీట్లు కాదు… బిసి బిల్లు తెండి

- Advertisement -
- Advertisement -

బిజెపి ప్రభుత్వానికి ఆర్. కృష్ణయ్య డిమాండ్
బిసి బిల్లుపై విధాన ప్రకటన చేయాలని అన్ని పార్టీలకు వినతి

మన తెలంగాణ / హైదరాబాద్: అన్ని రాజకీయ పార్టీలు బిసి బిల్లుపై విధాన ప్రకటన చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం బిసి యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు చట్టసభలలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై విధాన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు అన్యాయం చేశాయని విమర్శించారు. బిసి వర్గానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నందున పార్లమెంటులో బిసి బిల్లు పెట్టాలన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదని ఆయనన్నారు.

బిజెపి బిసిని ముఖ్యమంత్రి ప్రకటించడంతో సరిపోదని చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినపుడే బిసిలకు న్యాయం జరుగుతుందని కృష్ణయ్య అన్నారు. బిసిల కులాల వారి లెక్కలు తీసి, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచుతామని, స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు పెంచుతామని, క్రిమిలేయర్ తొలగిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడాన్ని ఆయన ఆహ్వానించారు. ఇది బిసి ఉద్యమ ఫలితమని అన్నారు. రాజ్యాధికారంలో బిసిలకు వాటా ఇచ్చేవరకు బిసి ఉద్యమం కొనసాగుతుందని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. రాజ్యాంగ రచన సమయంలోనే బిసిలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో రిజర్వేషన్లు కల్పించినట్లైతే ఎంతో ప్రగతి జరిగేదని, కులతత్వం కనీస స్థాయికి వచ్చేదని అన్నారు. బిఆర్‌ఎస్ బిసిల అభివృద్ధిపై విధాన ప్రకటన చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

కులాల వారి జనాభా లెక్కలు, చట్టసభలలో రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగాలలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు అంశంపై విధాన ప్రకటన చేయాలన్నారు. బిసి బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీకే బిసిల మద్దతు ఉంటుందన్నారు. మహిళా బిల్లు పెట్టిన మాదిరిగా బిసి బిల్లు పెట్టాలని, బిసిలకు ఎక్కువ సీట్లతో సమస్య శాశ్వత పరిష్కారం కాదని బిసి బిల్లుతోనే సాధ్యమని కృష్ణయ్య అన్నారు. బిజెపికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిసి బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. బిసిలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఏటా రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని కోరారు. బిసి మహిళలకు సబ్ కోటా కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో బిసి నాయకులు నీలం వెంకటేశ్, నందా గోపాల్, బెజవాడ ప్రణీత్, పృధ్వీ గౌడ్, వి. శివ శంకర్, ఉదయ్ నేత, మార్గాని సుశీల, మోడి రాందేవ్, జయంతి, శివమ్మ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిసి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శింగా బెజవాడ ప్రణీత్‌ను నియమించారు. ఎంపి ఆర్ కృష్ణయ్య ప్రణీత్‌కు నియామకపత్రం అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News