కేంద్రంపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన సముదాయాల కోసం నిర్మించతలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును పూర్తి వృథా ఖర్చుగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ముక్కోణపు ఆకారంలో నూతన పార్లమెంట్ భవనం, ఉమ్మడి కేంద్ర సచివాలయం, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు 3 కిలోమీటర్ల రాజ్‌పథ్ పునర్నిర్మాణం, ప్రధాన మంత్రి, ఉప రాష్ట్రపతికి నూతన నివాస భవనాలు సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగం. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్న సిపిడబ్లుడి దీని అంచనా వ్యయాన్ని రూ. 11,794 కోట్ల నుంచి రూ. 13,450 కోట్లకు పెంచింది.
కాగా, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును నిలిపివేసి కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న ప్రజల ప్రాణాలను రక్షించడంపై దృషి పెట్టాలని కోరుతున్నారు. ఈ ప్రాజెక్టుపై శుక్రవారం తాజాగా స్పందించిన రాహుల్ గాంధీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టును వృథా ఖర్చుగా అభివర్ణిస్తూ కొత్త ఇల్లు కావాలన్న మీ అహంకారాన్ని పక్కనపెట్టి ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టాలంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు.