పాక్ విదేశాంగ కార్యాలయం వ్యాఖ్య
ఇస్లామాబాద్: అపరిష్కృత సమస్యలపై భారత్‌తో చర్చలకు తమ తలుపులు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని, అయితే ఫలప్రదమైన, నిర్మాణాత్మకమైన చర్చలకు అవసరమైన వాతావరణం ప్రస్తుతం లేదని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం వ్యాఖ్యానించింది. పాక్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దౌత్యపరమైన విషయాలలో తలుపులు ఎప్పుడూ మూసుకోవని ఆయన అన్నట్లు డాన్ వార్తాపత్రిక తెలిపింది. ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో పొరుగుదేశమైన పాకిస్తాన్‌తో సంబంధాలు కొనసాగించాలన్నదే తమ అభిమతమని భారత్ ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసింది. కాగా..ఈ విషయంలో తమ దేశం కూడా ఏకాభిప్రాయంతో ఉందని ఇఫ్తికర్ అన్నారు. భారత్‌తో శాంతియుతంగా వివాదాలను పరిష్కరించుకోవడానికే పాక్‌కు చెందిన గత ప్రభుత్వాలు కృషి చేశాయని ఆయన చెప్పారు.