Monday, December 23, 2024

ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ హైదరాబాద్ సిటీ !

- Advertisement -
- Advertisement -

నగర ప్రతిష్ఠను నిలబెట్టడానికి మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడుతాం
మూసీ నది అభివృదికి మాస్లర్ ప్లాన్ రూపొందిస్తున్నాం
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్ 2 ప్రారంభం
చాంద్రాయణ గుట్టలో మెట్రో జంక్షన్ ఏర్పాటు చేస్తాం
ఫరూక్‌నగర్ బస్‌డిపో వద్ద పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన సిఎం రేవంత్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్:  గ్రేటర్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భాగ్యనగర ప్రగతిని నిరాటంకంగా కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఫలక్‌నుమా సమీపంలోని ఫరూక్‌నగర్ బస్‌డిపో వద్ద పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు ఎంజిబిఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఐదున్నర కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల హయాంలో జరిగిన భాగ్యనగర అభివృద్ధిని ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుందని వివరించారు.

పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ. 200 కోట్లు, మీరాలం వంతెన కోసం రూ.360 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. చాంద్రాయణ గుట్ట జంక్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇచ్చి పాతబస్తీకి అవసరమైన నిధులు త్వరలో కేటాయిస్తాననని వెల్లడించారు. కులీ కుతుబ్‌షా నుంచి మొదలు పెడితే, నిజాం నవాబులు వరకు హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా చేయడానికి అహర్నిశలు కృషి చేశారు. అంతర్జాతీయ చిత్ర పటంలో భాగ్యనగరానికి ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠను తీసుకువచ్చారు. ఆ ఖ్యాతిని కొనసాగించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉందన్నారు. ఎన్నికలు వచ్చినపుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధినే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు, ఇందుకోసం ఇప్పటికే లండన్ థెమ్స్ నగరాన్ని అక్బరుద్దీన్‌తో కలిసి సందర్శించినట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్ 2 ను తీసుకొస్తున్నట్లు, ఓవైసీ ఆసుపత్రి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవర్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరిస్తామని చెప్పారు.మైనార్టీల కోసం 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. గండిపేట నుంచి నగరంలోని 55 కిమీ పరిధిలో మూసీనది పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఓల్డ్ సిటీగా ప్రసిద్ధి చెందిన పాతబస్తీ ఒరిజినల్‌గా హైదరాబాద్‌గా అభివర్ణించారు. గత ప్రభుత్వం ధనికుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో మార్గం ప్రతిపాదించగా, తమ ప్రభుత్వం మాత్రం పేదలందరికీ పనికొచ్చేలా మార్పులు చేసిందన్నారు. చంచల్‌గూడ జైలు నగర శివారు ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు. పాతబస్తీ ప్రజల ఉన్నత చదువు కోసం విద్యాలయాలను అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. దేశంలో ఉన్న అందరు ముస్లింల గొంతుకగా వారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక నాయకుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రమేని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపి అనిల్‌కుమార్‌ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి సలహదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, స్దానిక ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News