Wednesday, January 22, 2025

మా జోలికొస్తే ఢిల్లీలో మట్టుబెడతాం

- Advertisement -
- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వాలంటే ప్రధాని మోడీకి చులకనగా కనిపిస్తున్నట్లున్నది. మహారాష్ట్రలో జరిగినట్లు తెలంగాణలో మీ పప్పులుడకవు. స్వరాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు 60ఏళ్లు పోరాటం చేశారు. మరో పోరాటానికి ఏమాత్రం వెనుకాడరు. అవసరమైతే నవ భారత నిర్మాణం కోసం మరోసారి ఉద్యమిస్తాం.
                                                                                               – ముఖ్యమంత్రి కెసిఆర్

కేంద్రానికి కెసిఆర్ హెచ్చరిక

ప్రధాని అవినీతి చిట్టా మా దగ్గరుంది
త్వరలోనే బయటపెడతాం బిజెపి పాలనలో
ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం పాలన
చేతకాకపోతే దిగిపోవాలి వికాసం పేరుతో
దేశం సర్వనాశనం మీరు ప్రధాని కాదు..
షావుకార్ల సేల్స్‌మెన్ ప్రతిపక్షాల ఉమ్మడి
అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచార కార్యక్రమంలో
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

మన తెలంగాణ / హైదరాబాద్ : దమ్ముంటే.. ప్రభుత్వాన్ని కూల్చండి! ఇక్కడ టచ్ చేసేలోగా ఢిల్లీలో బిజెపి ప్రభుత్వాన్ని మట్టుబెడతామని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అంత చులకనగా మోడీకి కనిపిస్తున్నాయా? అని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్యం అంటే ఇదే నా? అని కెసిఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో జరిగినట్లుగా ఇక్కడ మీ పప్పులు ఉడకవని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రజలు 60 ఏళ్లు పోరాటం చేశారని, మరో పోరాటానికి కూడా వెనుకాడరని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే నవ భారత ని ర్మాణం కోసం మరోసారి ఉద్యమిస్తామన్నారు. మోడీ తనకు తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని కెసిఆర్ విమర్శించారు. శాశ్వతంగా పదవిలో ఉంటానని అనుకుంటున్నారని కలలు కంటున్నారని సిఎం ఎద్దేవా చేశారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, త్వరలోనే ఆ మార్పు దేశంలో వచ్చి తీరుతుందన్నారు.

నరేంద్ర మోడీ ఒక ప్రధాన మంత్రిగా కాకుండా ఒక సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎంత అవినీతి చేశారో, మీ స్నేహితులైన వ్యాపారులకు ఎంతదోచి పెట్టారో? మా దగ్గర లెక్కలున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు. మొత్తం అవినీతి చిట్టాను త్వరలోనే బయటపెడతానని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను మోడీ పూర్తిగా దుర్వినియోగం చేశారని కెసిఆర్ మండిపడ్డారు. మోడీ పాలన అంతా కార్పొరేట్ సంస్థలకే తప్ప, సామాన్య ప్రజలకు ఎటువంటి మేలు జరగడం లేదని మండపడ్డారు. ఆయన అసమర్థ పాలన కారణంగా దేశ ప్రతిష్ట మసకబారుతోందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాట వినని రాష్ట్ర ప్రభుత్వాలను మోడీ ప్రభుత్వం అక్రమంగా కూలదోస్తోందని కెసిఆర్ దుయ్యబట్టారు. ఇప్పటికే విపక్షాలకు చెందిన తొమ్మిది ప్రభుత్వాలను కూల్చిన ఘనత మోడీకే దక్కిందని కెసిఆర్ దుయ్యబట్టారు.

వికాసం పేరుతో దేశం నాశనం….

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా హైదరాబాద్ జలవిహార్‌లో శనివారం టిఆర్‌ఎస్ నిర్వహించిన సభలో ప్రధాని మోదీ లక్ష్యంగా సిఎం కెసిఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ ఎనిమిదేళ్ల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. టార్చిలైట్ వేసి వెతికినా కనిపించవని ఆయన ఎద్దేవా చేశారు. పాలన చేతకాక రాష్ట్రాల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ దేశ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. వికాసం పేరుతో మోడీ దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఆయన పాలనలో దేశమంతా తిరోగమనమేనన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని ఎంత వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలని ఈ సందర్భంగా కెసిఆర్ డిమాండ్ చేశారు. నల్లధనం నియంత్రణ కాదు, దేశంలో మరింత రెట్టింపు అయ్యిందన్నారు. అవినీతి రహిత భారత్ అని పెద్దపెద్ద మాటలు చెప్పారు, కానీ, మోడీ పాలనలో అవినీతిపరులు పెరిగారని కెసిఆర్ ఆరోపించారు. ఆయన పాలనలో అన్నీ స్కామ్‌లో జరిగాయని ఆయన విమర్శించారు. బిజెపి పాలనలోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎందుకు పడిపోయిందో చెప్పాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. నేపాల్, బంగ్లాలో రూపాయి విలువ పడిపోదు కానీ, మన దేశానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని కెసిఆర్ ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా అనేది శుద్ధ అబద్ధమని ఆయన ఆరోపించారు. బిజెపి పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి జిడిడి దారుణంగా పడిపోయిందన్నారు. సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి నెలకొందన్నారు

మీ రక్తంలో కొంతైనా నిజాయితీ ఉంటే….

మోడీలో ప్రవహించే రక్తంలో కొంతైనా నిజాయితీ ఉంటే తాము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేరిందా? అని ఆయన ప్రశ్నించారు. రైతులు, ఉగ్రవాదులు, వేర్పాటు వాదులుగా కనిపిస్తున్నారా? అని ఆయన నిలదీశారు. వారిని ఉగ్రవాదులు, ఖలీస్థానీలు అన్నారని ఆయన మండిపడ్డారు. రైతు చట్టాలు సరైనవే అయినప్పుడు వెనక్కి ఎందుకు తీసుకున్నారని కెసిఆర్ ప్రశ్నించారు. దేశం ముందు ప్రధాని తలదించుకున్నారని, దేశ ప్రజలను తల దించుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. మీ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు ఇలా ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. శ్రీలంకకు వెళ్లినప్పుడు ప్రధానిలా కాకుండా సేల్స్‌మెన్‌గా వ్యవహారించారన్నారు. మీరు దోషి కాకుంటే రేపటి సభలో సమాధానం ఇవ్వాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. ఆయన పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజారుతోందని కెసిఆర్ విమర్శించారు. దీనిపై మోడీ ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే దేశంలో సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నా విదేశాల నుంచి బొగ్గు కొనాలని రాష్ట్రాలకు కేంద్రం హుకుం జారీచేసుందని ప్రశ్నించారు. కేంద్రం తీసుకుంటున్న తలాతోక లేని నిర్ణయాల కారణంగా మీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందన్నారు. దేశం నుంచి పెద్ద కంపెనీలు వెళ్లిపోతున్నాయని ఇక తాము మౌనంగా ఉండలేమని పోరాటాలు చేస్తామని కెసిఆర్ పేర్కొన్నారు.

మోడీతో వ్యక్తిగత విభేదాలు లేవు

మోడీతో తనకు వ్యక్తిగత విబేధాలు లేవని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. కానీ ఆయన విధానాలే తమకు అభ్యంతరమన్నారు. తాము మౌనంగా ఉండబోమని, పోరాటం చేస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ సహా అన్ని ధరలు పెంచేసిందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. ఇవి చాలదన్నట్లు నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని, ఉద్యమంలో కొందరు రైతులు మృతిచెందారన్నారు. వారి కుటుంబాలకు తాము రూ. 3 లక్షలు ఇస్తే, బిజెపి తమను చులకనగా చూసిందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు.

జనంలో ఆగ్రహం పెరుగుతోంది

మోడీ పాలనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఆయన ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సభలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సిఎం కెసిఆర్ ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లలో దేశంలో భారీ స్కాంలు జరిగాయని కెసిఆర్ ఆరోపించారు.

ఎన్నికల సమయంలోనే తియ్యటి మాటలు

ఎన్నికల సమయంలో తీయతీయని మాటలు మాట్లాడటం, ఎన్నికలు ముగిశాక అబద్దపు మాటలు మాట్లాడటం మోడీ విధానమన్నారు. దీనిని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. దేశం అనుభూతి చెందుతోందన్నారు. రైతు చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత వారికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కెసిఆర్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు వాటి జాడే లేదన్నారు. రైతు మిమ్మల్ని బంగారం, వజ్రాలు అడటం లేదు కదా! రైతు తాను పండించిన పంటకు ధర అడుగుతున్నారు. మద్దతు ధర అడుగున్నారన్నారు. రైతులు వారి హక్కులను కోరుకుంటున్నారన్నారు. అది ఇచ్చే సామర్థ్యం కూడా మీకు లేదా? అని కెసిఆర్ ప్రశ్నించారు. మీరు గొంతు పెంచి, మీ మనసుకు తోచినట్టు మాట్లాడుతున్నారని, రానున్న కాలంలో ఇది నడవదన్నారు. రైతు చట్టాలు సరైనవే అయితే వాటిని వెనక్కు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు.

ఎవరూ శాశ్వతం కాదు…

తానే శాశ్వతమని మోడీ భావిస్తున్నారు, కానీ, ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని, కాబట్టి మార్పు అనేది తప్పనిసరి అన్నారు. మోడీ పాలనలో రైతులు పాట్లు పడుతున్నారు. నిరుద్యోగులు బాధ పడుతున్నారు. పారిశ్రామికవేత్తలు గందరగోళంలో ఉన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ధరలు పెరుగుతున్నాయి. మీ పరిపాలన స్వభావం ఏమిటి ? దీని వల్ల దేశానికి ఏం ఒరిగింది ? అన్ని రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం అవుతున్నాయని కెసిఆర్ ఆరోపించారు. ఇది మోడీకి హాబీగా మారిందని, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని సతాయిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంలో మోడీ బిజీగా ఉన్నారని కెసిఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు మీరు 9 ప్రభుత్వాలను కూల్చారని, ఇది మీ రికార్డులో ఉందని, దీని పర్యవసానం చాలా ఘోరంగా ఉంటుందన్నారు. గతంలో 14 మంది ప్రధానులుగా పనిచేశారని, కానీ వారిలో హయంలో దేశ ప్రతిష్ట ఇంతలా దిగజారలేదని ఆయన పేర్కొన్నారు.

పెట్టుబడిదారులు పారిపోతున్నారు

మోడీ ప్రధాని అయ్యాక మేకిన్ ఇండియా అనే మరో నినాదాన్ని ఇచ్చారన్నారు. కానీ దీనివల్ల ఏమైన ఫలితాలు వచ్చాయా? అని మోడీని అడుగుతున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. మీరంటే భయంతో, మీ పద్ధతులతో, మీ విధానాలతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను తీసుకొని దేశం నుంచి పారిపోతున్నారని కెసిఆర్ ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన తప్పిదాలతో మన దేశం నుంచి ఇతర దేశాలకు బ్రెయిన్ డ్రెయిన్ (మేధో వలసలు) జరిగాయన్నారు. మీ పదవీకాలంలో పెట్టుబడులు తిరిగి పోతున్నాయని, లక్షల కోట్లు ఉపసంహరించుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారని, మేకిన్ ఇండియాతో ఏం జరగలేదని, అన్నీ అబద్దాలు చెప్పారని కెసిఆర్ మండిపడ్డారు. హిమాలయాలకు అటు వైపున ఉన్న చైనాలో ఏం జరిగిందో చూడాలని కెసిఆర్ సూచించారు. ఒకవేళ మీకు తెలివి లేకుంటే తెలుసుకోవచ్చునన్నారు. మన దగ్గర బోలెడు మాటలే తప్ప చేతలు శూన్యమని ఆయన పేర్కొన్నారు. మనకంటే చాలా పేద దేశంగా ఉన్న చైనా ప్రస్తుతం 16 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో నిలిచిందన్నారు. కానీ భారత్ కేవలం 5 ట్రిలియన్ డాలర్ల కలను చూపెట్టి దేశం ప్రతిష్టను మంటగలిపిందని, ఇవి తన లెక్కలు కావని, ప్రభుత్వం చెబుతున్న లెక్కలని కెసిఆర్ పేర్కొన్నారు.

దేశం సరైన దిశలో పయనించడం లేదు

దేశం సరైన దిశలో పయనించడం లేదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం మౌనంగా ఉండకూడదన్నారు. దీనికి వ్యతిరేకంగా గళాన్ని వినిపించాల్సి అవసరం ఉందన్నారు. ఇందుకు అందరూ ఏకం కావాల్సి ఉందన్నారు. దేశానికి మార్పు అవసరమని, అది గుణాత్మక మార్పు అయి ఉండాలన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకురావాల్సి ఉందన్నారు. ఇది నేడు దేశానికి చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది తాను కాదు. యావత్ దేశం అంటుందన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 13 నెలలు ఉద్యమం చేశారన్నారు. ఉద్యమం చేస్తూ చేస్తూ 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా కేంద్రానికి పట్టింపే లేకుండా పోయిందన్నారు. కనీసం వారి పట్ల జాలీ కూడా చూపలేదన్నారు.

ఆత్మప్రబోధానుసారం ఓటెయ్యండి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని సిఎం కెసిఆర్ దేశంలోని రాష్ట్రపతి ఎన్నికల్లో పా ల్గొనబోయే ఎలక్టోరల్ కాలేజీని కోరారు. గతంలో వివి గిరి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆత్మ ప్రబో ధంతో ఓటు వేయాలన్న నినాదం వచ్చింది. దానికి అను గుణంగా ఓట్లు పడి వివి గిరి విజయం సాధించారు. ఇది మన దేశ చరిత్ర అని చెబుతూ ఈ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను బేరీజు వేసుకుని ఎంపిలు, శాసనసభ్యులు ఓటు వేయాలని కెసిఆర్ సూచించారు. ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందన్నారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే పార్లమెంటేరియన్లంతా ఆత్మ ప్రభోదానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటేయాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ లాంటి మంచి నేతను ఎన్నుకోవడం అదృష్టమన్నారు. సమున్నత వ్యక్తిత్వం ఉన్న యశ్వంత్ సిన్హా గెలుస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆయన గెలవాలని మనసారా కోరుకుంటున్నట్లు తద్వారా దేశ గౌర వం రెట్టింపు అవుతుందన్నారు. సిన్హా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారని కెసిఆర్ కొనియాడారు. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించి వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారని తెలిపారు. సిన్హాకు అన్ని రం గాల్లో విశేష అనుభవం ఉందని కెసిఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News