న్యూఢిల్లీ: 2021నాటి రోడ్డు ప్రమాదాల్లో కేవలం సీటుబెల్టు పెట్టుకోక పోవడం వల్లనే 16,397 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదార్ల మంత్రిత్వశాఖ నివేదిక వెల్లడించింది. వీరిలో 8438 మంది డ్రైవర్లు కాగా, 7959 మంది ప్రయాణికులు ఉన్నారని వివరించింది. అలాగే హెల్మెట్ ధరించకపోవడం వల్ల 46,593 మంది మృతి చెందగా, వీరిలో 32,877 మంది డ్రైవర్లు, 13,716 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంది. 2021లో దాదాపు 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, మొత్తం 1,56,972 మంది చనిపోగా, 3,84,448 మంది గాయపడ్డారు.
హెల్మెట్ ధరించకపోవడంతో 93,763 మంది గాయపడ్డారని, సీట్‌బెల్ట్ ధరించక 39,231 మంది గాయపడ్డారని నివేదిక వివరించింది. హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటి భద్రతా పరికరాలు ఉపయోగించక పోవడంతో ప్రమాదాలే కాకుండా, ప్రాణాపాయ, తీవ్ర గాయాలు పాలయ్యే పరిస్థితిని తప్పించలేమని పేర్కొంది. టు వీలర్స్‌కు హెల్మెట్ తప్పనిసరి. గత సెప్టెంబర్4 న మహారాష్ట్ర పాల్ఘార్ జిల్లాలో మాజీ టాటా సంస్థ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి కారణం. ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న స్నేహితుడు జహంగీర్ పండోల్ సీట్‌బెల్టులు పెట్టుకోలేదు. దాంతో వారు వేగంగా వెళ్తున్న కారులోంచి విసిరివేయబడ్డారు. వెనక సీట్లలో కూర్చున్నప్పటికీ సీట్‌బెల్ట్ పెట్టుకోకుంటే రూ. 1000 జరిమానా విధించాలని నిబంధనలు ఉన్నాయి. కానీ చాలామందికి ఇది తెలీదు, లేదా పట్టించుకోరు.