Thursday, October 24, 2024

‘నోటా’కు కోరలు!

- Advertisement -
- Advertisement -

NOTA established in ballot paper in 2013

 

దేశంలో ఎన్నికలు మొక్కుబడి ఘట్టంగా మారిపోయి చాలా కాలమైపోయింది. ప్రజల ఓటుతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్న పాలకులు పాలనలో ప్రజాభీష్ఠానికి బొత్తిగా విలువ ఇవ్వకుండా ఇష్టావిలాసంగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాహితానికి బదులు స్వార్థపర శక్తుల ప్రయోజనాలకు తోడ్పడే చర్యలకు పాల్పడుతున్నారనే అభిప్రాయానికి తావిస్తున్నారు. దీని వల్ల ప్రజలకు అపారమైన హాని, మానసిక క్షోభ కలుగుతున్నాయి. ఎన్నికల వ్యవస్థ పట్ల ప్రజల అసంతృప్తికి ఇది దోహదం చేస్తున్నది. దీనికి విరుగుడుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 2013లో బ్యాలట్ పత్రంలో నోటా (నన్ ఆఫ్ ది ఎబౌవ్ పై వారిలో ఎవరూ వద్దు) అనే ఓటు వినియోగ ద్వారాన్ని బ్యాలట్ పత్రం చివర ఏర్పాటు చేశారు. దానితో వ్యతిరేక ఓటు సదుపాయమున్న 14వ దేశంగా ఇండియా అవతరించింది. ఆదిలో దీని పట్ల అంతగా ఆసక్తి చూపని ఓటర్లు రానురాను కొంత చైతన్యవంతులై దానిని వినియోగించుకుంటున్నారు. కాని నోటాకు ఓటు వేయడం వల్ల ప్రయోజనం ఏదీ లేదనే అభిప్రాయం కూడా ప్రజల్లో నాటుకున్నది.

బరిలోని అభ్యర్థులందరి కంటే నోటాకు ఓట్లు ఎక్కువ పడిన చోట ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని, అలాంటప్పుడు పాత బ్యాలట్ పత్రంలోని అభ్యర్థులకు తిరిగి అవకాశం ఇవ్వరాదని కోరుతూ దాఖలైన ఒక ప్రజాప్రయోజక వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దానిపై తమ అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్రానికి, ఎన్నికల సంఘానికి సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం ఈ పిల్‌ను విచారణకు తీసుకున్నది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకున్నదంటే మన ఎన్నికల విధానంలో మేలైన ఏదో ఒక మార్పును ఆశించి ఆ పని చేసిందని అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ సభ్యురాలు, సుప్రీం న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ ఈ ప్రజా వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బ్యాలట్ పత్రంలోని అభ్యర్థులందరూ సరైన వారు కారని భావించి వేసిన నోటా ఓటు గణనీయమైన సంఖ్యలో ఉంటే దాని ప్రభావం తప్పని సరిగా ఎన్నిక ఫలితం మీద పడి తీరాలి. అలా కానప్పుడు నోటాను చేర్చడమే వ్యర్థం.

నడుస్తున్న పోలింగ్ చరిత్రను, పార్టీల అభ్యర్థుల ఎంపిక తీరును గమనిస్తే మంచితనం, మేధస్సు, ప్రజలతో మమేకమై తిరిగేతత్వం ఉన్న వారిని అభ్యర్థులుగా నిలబెట్టడానికి బదులు డబ్బు, కండబలం ఉన్నవారికే టిక్కెట్లు ఇచ్చి మొత్తం ప్రాతినిధ్య రాజకీయాన్నే దిగజార్చి వేసిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల సరైన ప్రజాస్వామిక చైతన్యం, నిబద్ధత గలవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్నారు. మొత్తం ఎన్నికల రంగమే అక్రమార్కుల నాట్య వేదిక అయిపోయింది. దీని దుష్ప్రభావం జనజీవనాన్ని దయనీయంగా తయారు చేస్తున్నది. చట్టం తన పని తాను చేసుకోకుండా అడ్డుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే నోటా అవతరించింది. కాని నోటాకు జీవం పోసిన వారు అదే సమయంలో అది జీవచ్ఛవంగా పడిఉండిపోయే పరిస్థితిని కూడా సృష్టించారు. ఎన్ని నోటా ఓట్లు పడినా ఎటువంటి ప్రయోజనం లేని స్థితిని సృష్టించారు. పర్యవసానంగా నోటా ప్రజాస్వామ్య మేక మెడకు వేళ్లాడే పాలివ్వని చనుగానే చివరికి మిగిలిపోయింది.

బొటాబొటీ ఆధిక్యతను సాధించుకున్నా విజేతలు కాగలిగే విధానం ధనవంతులు, బలవంతులు సునాయాసంగా గెలుచుకోగలిగే స్థితికి కొంత కారణమవుతున్నది. కొన్ని దేశాల్లో ఉన్నట్టు దామాషా పద్ధతి ఓటింగ్ మన వద్ద లేదు. కనీసం నోటాకు కోరలు తొడిగినా కొంత ప్రయోజనం ఉంటుందనే కొంత ఆశతో ప్రజాప్రయోజక వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు 5 లక్షల 50 వేల ఓట్లు పడ్డాయి, అంటే పోలైన ఓట్లలో 1.8 శాతం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఎస్‌పిల ఉమ్మడి ఓట్ల కంటే అది ఎక్కువ. 12కి పైగా నియోజక వర్గాల్లో విజేతలు సాధించుకున్న వాటి కంటే అధికంగా నోటాకు ఓట్లు పడడం విశేషం. అయినా ఒక ఓటు ఆధిక్యతతో గెలుపు సాధించుకోడమే జరుగుతున్నది. దీనికి తెర దించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నోటాకు ఓటు వేయడం వ్యర్థమనే పరిస్థితిని వీలైనంత త్వరగా తొలగించాలి. నోటా పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించే గ్రూపులు తమ పని తాము చేస్తున్నాయి. ఫలితంగా నోటా ఓట్లు నెమ్మదిగానైనా పెరుగుతున్నాయి.

గరిష్ఠంగా 2015 బీహార్ ఎన్నికల్లో నోటా ఓటు 2.02 శాతానికి చేరుకున్నది. నిజానికిది ప్రజల్లో పెరిగిన చైతన్యాన్ని రుజువు చేయడం లేదు. అభ్యర్థుల పట్ల ఎంతో అసంతృప్తి ఉన్న ఓటర్లు కూడా నోటా వల్ల ప్రయోజనం బొత్తిగా లేదనే అభిప్రాయంతో దాని వైపు కన్నెత్తి చూడడం లేదు. అందుచేత నోటా ఓట్లు గణనీయంగా పడిన చోట తిరిగి ఎన్నికలు జరిపించడం, పాత బ్యాలట్ పత్రంలోని అభ్యర్థులందరినీ పోటీకి అనర్హులను చేయడం అవసరం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News