Sunday, January 19, 2025

‘నోటా’ ఓటును గెలిపిస్తుందా!

- Advertisement -
- Advertisement -

నోటా ఎన్నికలలో సాధారణ ప్రజల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఈ ఆప్షన్‌తో ఓటరు తన అయిష్టాన్ని వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉంది. తద్వారా తాము నిలబెట్టిన అభ్యర్థులను ప్రజలు అంగీకరించరని, మంచి అభ్య ర్థులను నిలబెట్టాలని పార్టీలకు సందేశం కూడా పంపినట్టవుతుంది. నోటా లేని కాలంలో ఓటరు ఏ అభ్యర్థినీ ఇష్ట పడకపోతే.. ఓటు వేయడానికి ముందుకొచ్చేవాడు కాదు. దీంతో ఆ ఓటు వృథా అయ్యేది.

జాస్వామ్యంలో పౌరులు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం అవసరం. ఇది సజీవ ప్రజాస్వామ్యానికి ప్రతీక. అయితే ఓటర్లు ఏ అభ్యర్థినీ అర్హులుగా గుర్తించకపోతే? దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల సంఘం ఒక వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఎంత శాతం మంది ప్రజలు ఎవరికీ ఓటు వేయడం సరికాదని భావించే ఈ ప్రక్రియకు కమిషన్ ‘నోటా’ అని పేరు పెట్టింది. ప్రజలు ఎన్నుకున్న నేతలే పాలకులుగా మారే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకం. కాలానుగుణంగా ఈ ఎన్నికల ప్రక్రియలో మార్పులు, సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో నిలిచే అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడుతూ ఉంటారు. వారిలో ఓటర్లు తమకు నచ్చినవారికి ఓటేయడం.. అలా ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ అభిప్రాయం ప్రకారమే నడచుకోవాలని అర్థం.

కానీ ఈ ప్రక్రియలోనూ తరచి చూస్తే లోపాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 100 ఓట్లు ఉన్న ఓ నియోజక వర్గంలో నాలుగైదు పార్టీలు, ఒకరిద్దరు స్వతంత్రులు పోటీ చేశారని అనుకుందాం. వారిలో ఒక అభ్యర్థికి 25 ఓట్లు, మిగతా అభ్యర్థులు, స్వతంత్రులకు 20 ఓట్ల కంటే తక్కువ వచ్చాయని అనుకుందాం. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం 25 ఓట్లు పొందిన అభ్యర్థి గెలిచినట్టు లెక్క. కానీ నిజానికి ఆ అభ్యర్థిని వద్దు అనుకున్న ఓటర్లు 75 మంది ఉన్నారు. అందుకే వారు తమకు నచ్చిన ఇతర అభ్యర్థికి ఓటేశారు. కానీ ఓటర్లు నిరాకరించడం అనేది లెక్కలోకి రావడం లేదు. కాబట్టి మెజారిటీ ప్రజలు అంగీకరించకపోయినా సరే ఈ ఎన్నికల ప్రక్రియలో గెలుపొందే అవకాశం ఉంది. అయితే ఒక్కోసారి పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ ఓటరుకు నచ్చలేదంటే..తన వ్యతిరేకతను తెలియజేయడానికి ఒకటే మార్గం ఉండేది.

అది పూర్తిగా ఎన్నికలను బహిష్కరచడమే. సాధారణ పరిస్థితుల్లోనే 100 ఓట్లకు పోలవుతున్నది గరిష్ఠంగా 70 శాతం కూడా ఉండడం లేదు. పట్టణ ప్రాంతాల్లో 50 శాతం ఓట్లు పోలైతే గొప్ప విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు నచ్చలేదని ఓటేయడం మానేస్తే.. ఆ ఎన్నికలకు అర్థమే లేకుండా పోతుంది. అందుకే అభ్యర్థులు నచ్చకపోయినా సరే.. ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సరికొత్త అవకాశమే నోటా (NOTA). None Of The Above కు సంక్షిప్త రూపమే NOTA. అంటే పైనున్న అభ్యర్థులెవరూ కాదు అని దాని అర్థం. అభ్యర్థుల పేర్లతో పాటు నోటా కూడా ఒక గుర్తును కలిగి, ఇవిఎంలో అన్నింటి కంటే చివరను ఉంటుంది. అభ్యర్థుల జాబితాలో ఏ ఒక్కరూ నచ్చలేదు అనుకున్నప్పుడు ఓటరు ఈ నోటాకు ఓటు వేయవచ్చు. సిఇసి నోటాను అందుబాటులో తేవడం వరకు ఓకే. అభ్యర్థుల గుణగణాలు పరిశీలించి..ఎవరూ నచ్చలేదని నిర్ణయించుకుని ఓటేసే ప్రజలు 100 మందిలో ఒకరిద్దరు ఉంటే ఎక్కువ. అటూ ఇటూగా సగటున 1 శాతం లోపే ఈ గుర్తుకు ఓట్లు పోలవుతుంటాయి.

ఈ మధ్యన 2023 ఏడాది చివరిలో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 1.5 శాతం ఓట్లు నోటాకు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. తద్వారా ఆ మేరకు ఓటర్లు తమ నిరసన వ్యక్తం చేసినట్టు రికార్డవుతోంది. కానీ ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులందరి కంటే ఎక్కువ ఓట్లు నోటా సాధిస్తే ఏమవుతుంది? ఇదే ప్రశ్న ఓటు వేయడానికి వెళ్లే చాలామంది మదిలో మెదులుతూ ఉంటుంది. చట్టసభలకు (అసెంబ్లీ, లోక్‌సభ) జరిగే ఎన్నికల్లో ఒకవేళ ఎక్కడైనా నోటాకు అత్యధిక ఓట్లు పడ్డాయంటే.. అక్కడ ద్వితీయ స్థానంలో నిలిచిన అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అంటే మెజారిటీ ప్రజలు అభ్యర్థులను తిరస్కరించినా సరే.. వారి తిరస్కరణకు ఫలితం లేకుండా పోతోంది. ఇదే అంశంపై సుప్రీం కోర్టులోనూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలయ్యాయి.హోరాహోరీగా వాదనలు జరిగాయి. తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో పిటిషనర్లు కొన్ని సూచనలు చేశారు. ఓటర్ల తిరస్కరణను కచ్చితంగా గుర్తించాలని, ఎక్కడైనా నోటా అత్యధిక ఓట్లు సాధిస్తే.. అక్కడ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, రద్దయిన ఎన్నికల్లోని అభ్యర్థులు మళ్లీ పోటీ చేయడానికి వీల్లేకుండా నిబంధనలు పెట్టాలని సూచించారు. రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే అన్న ప్రశ్న తలెత్తింది. ఓటర్లను ప్రభావితం చేయగల సంస్థలు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తే పదేపదే నోటాకే ఓట్లు వేయించే అవకాశం కూడా ఉంటుందని, మొత్తంగా ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుందన్న చర్చ కూడా జరిగింది. సర్వోన్నత న్యాయస్థానంలో కేసుల సంగతి ఇలా ఉంటే.. ఇప్పటికీ నోటా అంటే ‘కోరల్లేని పులి’ మాదిరిగానే మిగిలిపోయింది.

ఎం. నరసింహస్వామి
9949839699

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News