న్యూఢిల్లీ : ‘చైనా మనకు శత్రువు కాదు’ అన్న పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పిట్రోడా అభిప్రాయాలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి) జైరామ్ రమేష్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. ‘చైనాపై శామ్ పిట్రోడా వ్యక్తం చేసినట్లుగా పేర్కొంటున్న అభిప్రాయాలు కచ్చితంగా భారత జాతీయ కాంగ్రెస్‌వి కావు. చైనా మన అతిపెద్ద విదేశాంగ విధానం, బాహ్య భద్రత, ఆర్థికపరమైన సవాల్‌గా కొనసాగుతుంది’ అని రమేష్ తన పోస్ట్‌లో స్పష్టం చేశారు. పిట్రోడా తరచు చేసే వ్యాఖ్యలు ఆ పార్టీని వివాదాల్లోకి నెడుతుంటాయి. భారత్ దృక్పథం మారవలసిన అవసరం ఉందని, చైనాను శత్రువుగా భావించడాన్ని న్యూఢిల్లీ నిలిపివేయాలని పిట్రోడా ఇటీవల ఒక ఇంటర్వూలో సూచించారు.
‘చైనా మొదటి నుంచి శత్రువు అనే భావనను మార్చుకోవలసిన అవసరం ఉందని అనుకుంటున్నాను. అది కేవలం చైనాకు కాదు, కానీ ప్రతి ఒక్కరికీ& చైనా నుంచి ఏమి ముప్పు ఉందో నాకు తెలియదు. యుఎస్‌కు ఒక శత్రువును నిర్వచించే అలవాటు ఉన్న కారణంగా ఈ అంశాన్ని అతి చేశారని భావిస్తున్నాను’ అని పిట్రోడా ‘ఐఎఎన్‌ఎస్’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. దేశ భిన్నత్వంపై పిట్రోడా గతంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఆయనను నిరుడు ఒక నెలపైగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఒసి) చైర్మన్ పదవి నుంచి తొలగించిన విషయం విదితమే.ఆ వ్యాఖ్యలు జాతి వివక్ష, వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
తన వ్యాఖ్యల నేపథ్యాన్ని, బిజెపి తన వ్యాఖ్యలను దురుద్దేశంతో తప్పుగా అన్వయించిందని ఆరోపించిన తరువాత పిట్రోడాను ఐఒసి చైర్మన్‌గా నిరుడు జూన్‌లో తిరిగి నియమించారు. ఆ సమయంలో తాను భవిష్యత్తులో ఎటువంటి వివాదానికీ తావు ఇవ్వబోనని పిట్రోడా ‘హామీ ఇచ్చారు’ అని జైరామ్ రమేష్ తెలిపారు, అయితే, పిట్రోడా ఆ మాటలను నిర్దంద్వంగా ఖండించారు. అదిరమేష్ వ్యక్తిగత అభిప్రాయమని పిట్రోడా అన్నారు. కాగా, పిట్రోడా వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా ఆక్షేపించింది. పిట్రోడా వ్యాఖ్యలు చైనాకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు చేసే ప్రకటనలకు అనుగుణంగా ఉన్నాయని బిజెపి అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల గోష్ఠిలో ఆరోపించారు. పిట్రోడా అభిప్రాయాలు కాంగ్రెస్ మనస్తత్వానికి ప్రతీక అని త్రివేది అన్నారు.