Monday, November 18, 2024

లిక్కర్ స్కాంతో సంబంధం లేదు

- Advertisement -
- Advertisement -

బిజెపి బట్ట కాల్చి మీద వేయడం బిజెపికి అలవాటు
కెసిఆర్ బిడ్డను బదనాం చేస్తే ఆయనభయపడు తారను
కోవడం భ్రమ కేంద్రం ఏ దర్యాప్తు చేసిన సిద్ధమే : కవిత

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి సోమవారం హాజరయ్యారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడుతూ బిజెపి తన పై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తేల్చిచెప్పారు. తాను మానసికంగా కుంగిపోతానని బిజెపి పార్టీ వాళ్లు అనుకుంటున్నారని, బట్టకాల్చిమీద వేయడం బిజెపి పార్టీ పని అని ఆమె విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకర పరిణా మం కాదన్నారు. తనపై ఆరోపణలు చేసినంత మాత్రాన బిల్కిస్ బానో, ఇతర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు.

బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదని, దీనిని ప్రజలంతా గమనించాలని కవిత సూచించారు. కేంద్రంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని ఆమె పేర్కొన్నారు. కెసిఆర్ బిడ్డను బద్నాం చేస్తే కెసిఆర్ భయపడుతారేమో అని చూస్తున్నారని, ఇది వ్యర్థ ప్రయత్నమే తప్ప ఇలాంటి వాటికి కెసిఆర్ భయపడరని కవిత పేర్కొన్నారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, ఏ దర్యాప్తునకైనా సిద్ధమేనని, తమది పోరాటం చేసిన కుటుంబమని ఆమె తెలిపారు. తనపై ఏ విచారణ అయినా కేంద్రం చేసుకోవచ్చన్నారు. కెసిఆర్‌ను మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని ఆమె తెలిపారు.

ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం

ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఎవరికీ భయపడేది లేదని కవిత తేల్చిచెప్పారు. కెసిఆర్ కుమార్తెను కాబట్టే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఎంత ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గేది లేదని ఆమె పేర్కొ న్నారు. ఉద్యమ సమయంలోనూ కెసిఆర్‌పై అనేక ఆరోపణలు చేశారని, మొక్కవోని దీక్షతో సిఎం కెసిఆర్ ఉద్యమాన్ని నడిపించారన్నారు. మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని, భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలన్న కలతో, ఎజెండాతో సిఎం కెసిఆర్ ముందుకెళ్తున్నారని, తామంతా వారు చూపించిన బాటలోనే నడుస్తామని, భయపడేది లేదని కవిత పేర్కొన్నారు.

న్యాయనిపుణులతో చర్చలు

తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఢిల్లీ బిజెపి నాయకులపై దావా వేసేందుకు కవిత న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలిసింది. బిజెపి ఎంపి పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై పరువు నష్ట దావా వేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. -నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును అశ్రయించాలని కవిత భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా- ఇప్పటికే న్యాయ నిపుణులతో కవిత చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం.

సిబిఐ విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయి

సిబిఐ విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో టిఆర్‌ఎస్ ప్రముఖుల ప్రమేయం ఉందని ఆరోపించారు. పదేపదే ఢిల్లీకి వెళ్లి చేసింది లిక్కర్ స్కామ్ వ్యవహారాలేనని విమర్శించారు. ప్రజాసంగ్రామా యాత్రలో భాగంగా ఆ ప్రముఖులను ఉద్దేశించి విమర్శలు చేశారు. తెలంగాణలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం 30 వేల కోట్లకు పెరిగిందని ఈ స్కామ్‌పై వారు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, అన్ని విషయాలు బయటపెడతామని స్పష్టం చేశారు. ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా సంబంధం ఉంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తే తప్పకుండా వాస్తవాలు బయటకు వస్తాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై టిఆర్‌ఎస్ సర్కార్ స్పందించాలి’ -అని బండి సంజయ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News