Tuesday, November 5, 2024

మార్గదర్శి కేసులో రామోజీరావు, శైలజకు నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్ధ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వీటిపై దర్యాప్తు జరుపుతున్న ఎపి సిఐడి ఇప్పటికే పలువురు సంస్ధ బ్రాంచ్‌ల మేనేజర్లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపింది. ఇదే క్రమంలో తాజాగా సంస్ధ ఎండి శైలజతో పాటు రామోజీ గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నరామోజీరావుకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసు విచారణలో భాగంగా ఎపి సిఐడి అధికారులు ప్రశ్నించేందుకు వీలుగా రామోజీరావుతో పాటు శైలజ కూడా అందు బాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం సిఐడి అధికారులు నాలుగు తేదీల్ని వీరిద్దరికీ సూచించారు. మార్చి 29, 31, ఏప్రిల్ 3, ఏప్రిల్ 6 ఈ నాలుగు తేదీల్లో ఒకరోజు విచారణకు అందుబాటులో ఉండాలని వీరిద్దరికీ జారీ చేసిన వేర్వేరు నోటీసుల్లో సిఐడి అధికారులు పేర్కొన్నారు. విచారణ కోసం ఇల్లు లేదా ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలని వీరిద్దరిని కోరారు.

మార్గదర్శి అక్రమాల కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ఎ1గా ఉండగా ఆయన కోడలు, మార్గదర్శి ఎండి చెరుకూరి శైలజ ఎ2గా ఉన్నారు. దీంతో వీరిద్దరిని విచారించేం దుకు సిఐడి సిద్ధమవుతోంది. సమాజంలో వీరికున్న పరువు, ప్రతిష్టల్ని దృష్టిలో ఉంచుకుని ఇతర నిందితుల తరహాలో సిఐడి కార్యాలయంలో కాకుండా వారి ఇల్లు, లేదా ఆఫీసుల్లోనే వీరిని విచారించేందుకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరగబో తోందనే ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు ఎపిలో మార్గదర్శి సంస్ధ ఆఫీసులపై తీవ్ర చర్యలు తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఉన్న మార్గదర్శి సంస్ధ ప్రధాన కార్యాలయంతో పాటు ఎపిలోని ఇతర బ్రాంచ్ ఆఫీసులపైనా, అందులో పనిచేసే సంస్ధల పైనా తీవ్ర చర్యలు తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు నిందితుల్ని ప్రశ్నించేందుకు సిఐడి సిద్ధమవుతోంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు, మేనేజర్ల ఇళ్లపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సోదాలు చేసింది. మార్గదర్శి సంస్థలో నిబంధలు ఉల్లంఘనలు బయటపడ్డాయని ఎపి సిఐడి కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ నిబంధనలు ఉల్లంఘించిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కొంత కాలంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. విచారణ సందర్భంగా మార్గదర్శి శాఖల్లో పనిచేస్తున్న కామినేని రామకృష్ణ (సీతమ్మధార), సత్తి రవిశంకర్ (రాజమండ్రి), శ్రీనివాసరావు(లబ్బీపేట), గొరిజవోలు శివరామకృష్ణ(గుంటూరు)ను అరెస్టు చేసింది. తర్వాత వాళ్లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై ఎపి సిఐడి కేసులు నమోదు చేసింది. ఇండివిడ్యువల్ గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్ సమర్పించలేదని, బ్యాలెన్స్‌షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి అందజేయలేదని అధికారులు తెలిపారు. మూడు నెలలుగా మార్గదర్శికి చెందిన 444 గ్రూపులకు సంబంధించి కార్యకలాపాలను నిలిపివేశారని తెలిపారు. డిసెంబర్ నుంచి ఈ ఫారం నింపి ఇవ్వలేదంటున్నారు.

ఎఫ్‌ఐఆర్ లో రామోజీరావు, శైలజా కిరణ్ పేర్లు…

మొత్తం మూడు చట్టాల కింద సిఐడి కేసులు నమోదు చేసింది. ఐపిసి సెక్షన్ 120 (బి), 409, 420, 477 (ఎ), రెడ్ విత్ 34 కింద అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం, అలాగే చిట్ ఫండ్ యాక్ట్ 1982 లోని సెక్షన్ 76,79 ప్రకారం ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లుగా సిఐడి తెలిపింది. ఇందులో ఇన్వెస్టిగేటింగ్ అథారిటీగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉందని సిఐడి ఓ ప్రకటనలో తెలిపింది. నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, అలాగే ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ శైలజా కిరణ్, అలాగే ఆయా బ్రాంచీల మేనేజర్ల పేర్లను చేర్చారు. ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్న విషయాన్ని సిఐడి తన ప్రకటనలో తెలియ చేయలేదు. అయితే ఏఏ నగరాల్లో బ్రాంచీల్లో కేసులు నమోదు చేశారో వివరించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచిల్లో నిబంధనల ఉల్లంఘనపై ఈ కేసులు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News