Wednesday, January 22, 2025

కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు

- Advertisement -
- Advertisement -

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్‌పై గురువారం విచారణ జరిగింది. తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పరువు నష్టం కేసు వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిగిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఈనెల 8వ తేదీన పిటిషన్‌దారుడు నాగార్జున, సాక్షిగా ఉన్న సుప్రియల స్టేట్మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది.

కాగా ఈ నెల 23వ తేదీన మంత్రి కొండా సురేఖకు సంబంధించిన న్యాయవాదులు నోటీసులకు సంబంధించి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. సమాధానంకు సంబంధించి కోర్టు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందితే ఆ తర్వాత విచారణ చేపడుతుంది. లేదంటే మంత్రి కొండా సురేఖ కోర్టుకు వచ్చి తన స్టేట్ మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించిన అంశంలో మూడో సాక్షిగా వెంకటేశ్వర్లను ఉంచుకోవడం జరి గింది. గురువారం జరిగిన విచారణలో కేవలం సుప్రియ సాక్షి వరకూ చాలంటూ మిగతా వాదనలు కోర్టు పూర్తి స్థాయిలో వినింది. అనంతరం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..?
రాజకీయ విమర్శల్లో భాగంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. తనను సామాజిక మాధ్యమాల్లో బీఆర్‌ఎస్ పార్టీ వారు ట్రోల్ చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కెటిఆర్‌ను విమర్శించే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించడం, వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముఖంగా మాట్లాడడంతో అవి కాస్త హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువునష్టం దావా వేశారు.

వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న మంత్రి కొండా సురేఖ
అక్కినేని కుటుంబం, నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అన్యధా భావించవద్దని కొండా సురేఖ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News