ఈ నెల 29 నుంచి దరఖాస్తులు స్వీకరణ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) మొత్తం 833 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంటూ ప్రకటన జారీ చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. ఈ పోస్టుల కోసం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టులు, అర్హతలు, ఇతర పూర్తి వివరాల కోసం టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్ https://tspsc.gov.in లో తెలుసుకోవచ్చని వెల్లడించింది.
కాగా ఇటీవల మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టులకు టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రకటించిన పోస్టులకు గాను సెప్టెంబర్ 13 నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేది అక్టోబర్ 10, టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తుల్లో జరిగిన పొరపాట్లను సవరించుకోడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎడిట్ అప్షన్‌ను ఇచ్చింది. సెప్టెంబర్ 13వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యర్థులు ఎడిట్ చేసుకోవచ్చని కమిషన్ సూచించింది.