Thursday, January 23, 2025

నేడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి ఆర్‌ఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ
రెండు స్థానాలు, నాలుగు సెట్ల నామినేషన్ల దాఖలుకు అవకాశం
ఎన్నికల వ్యయానికి కొత్తగా బ్యాంకు ఖాతా తెరువాలి
ఆన్‌లైన్‌లో నామినేషన్లు స్వీకరణ
విదేశాల్లో ఉన్న రాష్ట్రవాసులకు బరిలో నిలిచే అవకాశం
క్షేత్ర స్థాయిలో వ్యయ పరిశీలకులు పరిశీలన

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నేడు (శుక్రవారం) నోటిఫికేషన్ జారీ కానున్నడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. శాసనసభకు 2023 సార్వత్రిక ఎన్నికల కోసం గవర్నర్ తమిళసై ఆదేశానుసారం కొత్త అసెంబ్లీని ఏర్పాటుకు నియోజకవర్గ స్థానాలకు ఎన్నికల సంఘం శుక్రవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఈ నోటిఫికేషన్ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు నామినేషన్లు శుక్రవారం నుంచి స్వీకరించనున్నారు. ఈ నెల 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి.. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల13న నామపత్రాల పరిశీలన చేపట్టనండుగా.. ఈ నెల 15 వరకు ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నెల 30న పొలింగ్ నిర్వహించి.. వచ్చేనెల 3న ఓట్లలెక్కింపు చేపడతారు. డిసెంబర్ 5లోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
రెండు స్థానాలు.. నాలుగు సెట్ల నామినేషన్ దాఖలుకు అవకాశం
ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగుసెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయరాదు. నామినేషన్ల దాఖలులో.. ఆర్వో, ఏఆర్వో కార్యాలయం సమీపంలోని వంద మీటర్ల పరిధిలోకి గరిష్ఠంగా మూడు వాహనాలనే అనుమతిస్తారు. నామినేషన్ ప్రక్రియ, కార్యాలయం వెలుపల వీడియో, సిసి టీవీ ద్వారా రికార్డు చేస్తారు. అభ్యర్థులు నామినేషన్లను ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చు. ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఆ సదుపాయం ఉందని అధికారులు చెప్పారు. ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించినా అభ్యర్థి నామినేషన్ ప్రతులపై సంతకంచేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. విదేశీ ఓటర్లు అక్కణ్నుంచే నామినేషన్ దాఖలు చేస్తే అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సులెట్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు నామినేషన్‌తో పాటు.. అఫిడవిట్ దాఖలు చేసి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఏ ఫారం, బి ఫారాలను నామినేషన్ల దాఖలుకు.. చివరిరోజు 3 గంటల్లోపు విధిగా ఇవ్వాలని వివరించారు.
ఎన్నికల వ్యయానికి ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరువాలి…
నియోజకవర్గాల బరిలో నిలిచే అభ్యర్థులు ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలను నామినేషన్‌తో పాటు సమర్పించాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి అయితే ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇతరులకు 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్‌తో పాటు అభ్యర్థి తన నేర చరిత్రలు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతల సమాచారాన్ని ప్రకటిస్తూ ఫారం- 26లో అఫిడవిట్‌ను దాఖలు చేయాలి. ప్రతిపాదకులంతా అదే నియోజకవర్గానికి చెందినవారై ఉండాలి. నామినేషన్‌తోపాటు.. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ పత్రాలన్నీ రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ఉంచాలి. అభ్యర్థుల అఫిడవిట్లను.. 24 గంటల్లోపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించింది. అఫిడవిట్‌లో ఏవైనా ఖాళీలుంటే.. ఆర్వో సదరు అభ్యర్థులకు నోటీస్ జారీచేయాల్సి ఉంటుంది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లైతే దాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. నామినేషన్ల దాఖలు సమయం నుంచే అభ్యర్థులు చేసే ఖర్చు ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తుంది. అప్పట్నుంచి అన్ని వివరాలు అభ్యర్థి నమోదు చేసి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
రంగంలోకి వ్యయ పరిశీలకులు…
శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. 67 మంది ఐఎఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించారు. ఎన్నికల నిర్వహణా ప్రక్రియను ఆయా నియోజకవర్గాల్లో వీరు పర్యవేక్షించనున్నారు. 39 మంది ఐపిఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు. వీరు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో శాంతిభద్రతల నిర్వహణ, సంబంధిత అంశాలను పర్యవేక్షిస్తారు. సాధారణ పరిశీలకులు, ఎన్నికల పరిశీలకులు ఈ నెల 10వ తేదీ నుంచి రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే 60 మంది ఐఆర్‌ఎస్, ఐఆర్‌ఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. నోటిఫికేషన్ విడుదల. నామినేషన్ల ప్రారంభంతో వ్యయ పరిశీలకులు శుక్రవారం నుంచి రంగంలోకి దిగనున్నారు. కేటాయించిన నియోజకవర్గాల్లో శాంతిభద్రతల నిర్వహణ, సంబంధిత అంశాలను వారు పర్యవేక్షిస్తారు.
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
నేటి (శుక్రవారం) ఉదయం నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు వంద మీటర్ల వరకు 144సెక్షన్ అమల్లో ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News