Friday, December 20, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో.. టెండర్ల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
బిడ్డింగ్‌కు జూలై 5ను చివరి తేదీగా ప్రకటించిన హెచ్‌ఎంఆర్‌ఎల్
నేటి నుంచి బిడ్డింగ్ పత్రాల జారీ
భూసామర్థ్య పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి
మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి సంబంధించి టెండర్లకు నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ఈ టెండర్లను పిలిచింది. నేటి నుంచి బిడ్డింగ్ పత్రాలను జారీ చేయనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్ తెలిపింది. ఈ బిడ్డింగ్‌కు జూలై 5ను చివరి తేదీగా ప్రకటించింది. ఈ ఎయిర్‌పోర్ట్ మెట్రో కాంట్రాక్టు విలువ రూ. 5,688 కోట్లుగా మెట్రో రైల్ లిమిటెడ్ నిర్ధారించింది. అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలన్న సిఎం కెసిఆర్ ఆలోచనలో భాగంగా హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో ఉండాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నగరం నుంచి పర్యాటకులను, విదేశీయులకు ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా విమానాశ్రయానికి చేరుకునేలా ఎక్స్‌ప్రెస్ మెట్రో రెండో దశ ఉండాలని 2018లో అధికారులకు సిఎం సూచించారు. అదే ఏడాది మార్చిలో హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

విమానాశ్రయంలోకి నేరుగా చేరుకునేలా…
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ మార్గానికి హెచ్‌ఎంఆర్‌ఎల్ డిపిఆర్‌ను రూపొందించింది. నిధులు లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే ఈ ఏడాది బడ్జెట్‌లో మెట్రోకు తగిన నిధులు కేటాయించడంతో ఆ ప్రాజెక్టు ఇప్పుడు శరవేగంగా దూసుకుపోనుంది. అందుకు సంబంధించి ఈ ఏడాది సిఎం కెసిఆర్ పచ్చజెండా ఊపి శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పుడు టెండర్లు పిలవడంతో ఆ ప్రాజెక్టు వేగం పుంజుకోనుంది. మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం ముందుకెళుతోంది. మైండ్‌స్పేస్ కూడలి నుంచి 900 మీటర్లు దూరంలో కొత్తగా నిర్మించే రాయదుర్గం ఎయిర్‌పోర్ట్ స్టేషన్‌తో విమానాశ్రయ మెట్రో రైలు ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచి బయో డైవర్సిటీ ఖాజాగూడ చెరువు పక్క నుంచి నానక్‌రాంగూడ కూడలి, అక్కడి నుంచి ఓఆర్‌ఆర్ పక్క నుంచి నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్, విమానాశ్రయ కార్గో మీదుగా విమానాశ్రయంలోకి నేరుగా చేరుకునేలా జీఎంఆర్ సమన్వయంతో ఈ ఎలైన్‌మెంట్ రూపొందించారు.

ప్రత్యేకతలు ఇలా…
విమానాశ్రయ మెట్రోలో ప్రస్తుతం ఉన్న మెట్రో కంటే మరింత అధునాతన సౌకర్యాలు కల్పిస్తారు.
ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించేలా సీట్లు (చైర్‌కార్లు) ఉంటాయి.
ప్ల్లాట్‌ఫాంపై భద్రత కోసం అద్దాలతో కూడిన స్క్రీన్ విండోస్ ఏర్పాటు చేస్తారు. స్టేషన్లో మెట్రోరైలు ఆగిన తర్వాత కోచ్ తలుపులు తెరచుకునే సమయంలోనే ఇవి తెరచుకుంటాయి. రైళ్లు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఏరో డైనమిక్స్‌లో మార్పు చేస్తారు. తేలికపాటి స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం కోచ్‌లు ఉంటాయి. కారిడార్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఈ స్టేషన్లు నిర్మిస్తారు. వాటికి ప్రయాణికులు చేరుకునేలా స్కైవాక్‌లను ఏర్పాటు చేస్తారు. స్టేషన్లలో విమాన రాకపోకల సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. సిఐఎస్‌ఎఫ్ పోలీసుల సమన్వయంతో లగేజీ తనిఖీలు చేస్తారు.

రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి 0.9కిలో మీటర్ల దూరంలో ఎయిర్‌పోర్టు టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది.
ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌లు క్లోజ్డ్ సర్క్యూట్‌తో ఉంటాయి.
శంషాబాద్ -ఎయిర్‌పోర్టులో కార్గో లైన్, ప్యాసింజర్ లైన్‌లు వేర్వేరుగా రెండు స్టేషన్లు ఉంటాయి.
ఆరు బోగీలు నిలిపేలా మెట్రోస్టేషన్ నిర్మాణం జరుగుతుండగా, తొలి దశలో మూడు బోగీలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు.

ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ హైలెట్స్ ఇలా….
పొడవు:31 కిలోమీటర్లు (మొత్తం)
ఎలివేటెడ్ వే: 29.3 కిలోమీటర్లు
రోడ్ వే: కిలోమీటర్
అండర్ గ్రౌండ్ వే: 1.7 కిలోమీటర్లు
వేగం: గరిష్టంగా 120 కిలోమీటర్లు
ఫ్రీక్వెన్సీ: 2.5నిమిషాలు (పీక్ ఆవర్స్)
సమయం:26 నిమిషాలు
స్టేషన్లు: 9
ప్రారంభం: రాయదుర్గం టెర్మినల్ (నూతనంగా)
నిర్మాణ సమయం: 36 నెలలు
అంచనా వ్యయం: రూ.6250 కోట్లు
గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం: ఎండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు ఈపిసి కాంట్రాక్టర్ ఎంపిక కోసం (ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినట్లు ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ టెండర్‌కు ఎంపికైన కాంట్రాక్టర్ మెట్రో రైలు వ్యవస్థకు అవసరమైన ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ పనులు, స్టేషన్లు, ట్రాక్ పనులు, ఎలక్ట్రికల్, మెకానికల్ పనులు, సరఫరా, రోలింగ్ స్టాక్ (రైలు బోగీలు), ఎలక్ట్రిక్ ట్రాక్షన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లు మొదలైనవి పూర్తిచేయాల్సి ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

పిల్లర్లపై 29.3 కి.మీలు, అండర్ గ్రౌండ్‌లో 1.7 కి.మీలు
ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్‌మెంట్ ఫిక్సేషన్ వంటి ప్రాథమిక పనులన్నీ పూర్తయ్యాయని ఆయన తెలిపారు. భూసామర్థ్య పరీక్షల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ఎయిర్ పోర్ట్ మెట్రో కోసం చేపట్టిన కొత్త సర్వే ప్రకారం రాయదుర్గ్ మెట్రోస్టేషన్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ స్టేషన్‌ల మధ్య మొత్తం దూరం 31 కి.మీలు కాగా, ఇందులో ఆకాశమార్గం (పిల్లర్లపై ఎలివేటెడ్) 29.3 కి.మీలని, అండర్ గ్రౌండ్‌లో 1.7 కి.మీ పొడవునా పనులు జరుగుతాయన్నారు.

భవిష్యత్‌లో మరో నాలుగు అదనపు స్టేషన్‌లు
విమానాశ్రయ మెట్రో కారిడార్ కు సమీపంలో అనేక వాణిజ్య, బహుళంతస్తుల భవనాల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతోందని ఎండి పేర్కొన్నారు. అన్ని తరగతులకు చెందిన వారు ఎయిర్ పోర్ట్ మెట్రో లైన్ ద్వారా నగరంలో వారి వారి కార్యాలయాలను చేరుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు అవసరమైతే భవిష్యత్‌లో మరో నాలుగు అదనపు స్టేషన్ల నిర్మాణానికి కూడా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. టెండర్ పత్రాలన్నీ తెలంగాణ ప్రభుత్వ ఈ పోర్టల్ https://tender.telangana.gov.inలో అప్‌లోడ్ చేయనున్నట్లు ఎండి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News