ప్రభుత్వ దవాఖాన్లలో 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 421 పోస్టులను మేల్ అభ్యర్థులతో, మరో 421 పోస్టులను ఫీమేల్ అభ్యర్థులను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్‌లో భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మేల్ యోగా ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం 32 యోగా సెషన్లకు అటెండ్ కావాలని, ఫీమేల్ యోగా ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం 20 యోగా సెషన్లకు అటెండ్ కావాలని పేర్కొన్నారు. ప్రతి సెషన్ గంట సేపు ఉంటుందని, ఒక్కో సెషన్‌కు రూ.250 చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తామని తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ఆయుష్ హెడ్ క్వార్టర్స్‌లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ నెల 24న ఆదిలాబాద్, హైదరాబాద్, 25న నిజామాబాద్, 26న మెదక్, రంగారెడ్డి, 27న వరంగల్, నల్గొండ,28న కరీంనగర్, 30వ తేదీన ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్‌లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం https://ayush.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.