త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల.. గెట్ రెడీ
మన తెలంగాణ/హైదరాబాద్ : నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 149 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే టిఎస్పిఎస్సి కి చేరాయి. త్వరలో విడుదల కానున్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి బీటెక్ ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు చదివిన అభ్యర్థులు అర్హులని పేర్కొంది. ఇదిలా ఉంటే రవాణా శాఖతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తం వైద్య ఆరోగ్య శాఖ లో ఉన్న 2662 పోస్టుల భర్తీకి సంబంధించి టిఎస్పిఎస్సి కి ప్రతిపాదనలను పంపించింది. అయితే 61 కేటగిరీలకు చెందిన 2662 పోస్టుల భర్తీ ప్రక్రియలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పంపించిన ప్రతిపాదనలు సరిగా లేకపోవడంతో టీఎస్పీఎస్సీ మళ్లీ వాటిని తిప్పి పంపించింది.
ఆయా పోస్టుల భర్తీకి ఉద్దేశించిన జీవోలు, అర్హతలు తదితర వివరాలు సమర్పిం చాలని టీఎస్పీఎస్సీ సూచించింది. తెలంగాణలో దశలవారీగా వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉద్యోగార్ధులకు తగిన సమయం ఇస్తూ పరీక్షలను నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 503 గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కించుకోవడానికి సువర్ణ అవకాశం కల్పించింది. ఇక మరోవైపు పోలీస్ శాఖలో కూడా ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడంతో నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్లలో కుస్తీలు పడుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 81 వేల ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ ప్రణాళికాబద్దంగా నోటిఫికేషన్లను జారీ చేస్తూ, సదరు నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అభ్యర్థులకు అందిస్తూ పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టడానికి ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగార్థులకు పలు సూచనలు చేస్తున్న ప్రభుత్వం మరిన్ని నోటిఫికేషన్లు రానున్నాయి.. గెట్ రెడీ అంటోంది.