Sunday, December 22, 2024

జకోవిచ్, స్వియాటెక్ శుభారంభం

- Advertisement -
- Advertisement -

లండన్: ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి క్రీడాకారులు నొవాక్ జకోవిచ్ (సెర్బియా), ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా) శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), ఐదో సీడ్ కరోలైన్ గార్సియా (ఫ్రాన్స్) తదితరులు తొలి రౌండ్‌లో విజయం సాధించారు. ఇతర పోటీల్లో నాలుగో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా), 12వ సీడ్ వెరోనికా కుదెర్‌మెటోవా (రష్యా), 19వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) జయకేతనం ఎగుర వేశారు. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్‌లో పెగులా 62, 67, 63 తేడాతో అమెరికాకే చెందిన లౌరెన్ డావిస్‌ను ఓడించింది. మరో పోటీలో వెరోనికా 76, 64తో కయా కనేపి (ఇస్టోనియా)ను ఓడించింది. ఇక మాజీ నంబర్‌వన్ అజరెంకా కూడా రెండో రౌండ్‌కు చేరుకుంది. మూడు సెట్ల సమరంలో అజరెంకా 64, 57, 64తో చైనాకు చెందిన యువాన్‌పై విజయం సాధించింది.

మరోవైపు గార్సియా తొలి రౌండ్‌లో సునాయాస విజయం అందుకుంది. అమెరికాకు చెందిన వోలినెట్స్‌తో జరిగిన పోరులో గార్సియా 64, 63తో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన గార్సియా ఏ దశలోనూ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు చెలరేగి ఆడుతూ అలవోక విజయం సాధించింది. మరో పోటీలో టాప్ సీడ్ స్వియాటెక్ కూడా సునాయాస విజయం అందుకుంది. చైనా క్రీడాకారిణి జూతో జరిగిన తొలి రౌండ్‌లో స్వియాటెక్ 61, 63తో జయభేరి మోగించింది. ప్రారంభం నుంచే ఇగా చెలరేగి ఆడింది. ఆమె ధాటికి జూ కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. చివరి వరకు జోరును కొనసాగించిన ఇగా అలవోకగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది. మరో పోటీలో పోలండ్‌కు చెందిన మగ్దా లినెట్ విజయం సాధించింది. స్విట్జర్లాండ్ క్రీడాకారిణి జిల్ టిచ్‌మాన్‌తో జరిగిన తొలి రౌండ్‌లో లినెట్ 63, 62తో జయకేతనం ఎగుర వేసింది.

నొవాక్ అలవోకగా..
ఇక పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ ముందంజ వేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో జకోవిచ్ 63, 63, 76 తేడాతో అర్జెంటీనాకు చెందిన పెడ్రొ చాచిన్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే జకోవిచ్ దూకుడును ప్రదర్శించాడు. తన మార్క్ ఆటతో ప్రత్యర్థిని ముచ్చెమటలు పట్టించాడు. జకో ధాటికి పెడ్రొ పూర్తిగా చేతులెత్తేశాడు. చివరి వరకు దూకుడును ప్రదర్శించిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌కు కొంత సేపు వర్షం అడ్డంకి సృష్టించింది. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ రుబ్లేవ్ విజయం సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన పుర్సెల్‌తో జరిగిన మొదటి రౌండ్‌లో రుబ్లేవ్ 63, 75, 64తో జయభేరి మోగించాడు. ఇతర పోటీల్లో 14వ సీడ్ లురెన్జో ముసెట్టి (ఇటలీ), 17వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలండ్) తదితరులు విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News