లండన్: ప్రపంచ టెన్నిస్‌లో రారాజుగా పేరున్న సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్ టెన్నిస్‌పై కన్నేశాడు. ఇప్పటికే పురుషుల గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. సుదర్ఘీ టెన్నిస్ కెరీర్‌లో జకోవిచ్ ఎన్నో రికార్డులను తిరగ రాశాడు. ఇటీవలే ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించడం ద్వారా జకోవిచ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పురుషుల టెన్నిస్‌లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సాధించిన 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును జకోవిచ్ తిరగరాశాడు. 23 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో జకోవిచ్ మొదటి స్థానానికి చేరుకున్నాడు.
ఇక జులై మూడు నుంచి ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లోనూ జకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. కెరీర్‌లో జకోవిచ్ ఇప్పటికే ఏడు వింబుల్డన్ టైటిల్స్ సాధించాడు. తాజాగా మరో టైటిల్‌పై కన్నేశాడు. రెండు సీజన్‌ల నుంచి జకోవిచ్ వరుస టైటిల్స్ సాధిస్తూ వస్తున్నాడు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. 2021, 2022లలో జకోవిచ్ వింబుల్డన్ టైటిల్స్‌ను సాధించాడు. తాజాగా మరోసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. తనకు ఎంతో కలిసి వచ్చే వింబుల్డన్‌లో హ్యాట్రిక్ టైటిల్స్‌తో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీల సంఖ్యను 24కు పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. జకోవిచ్ ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఈసారి కూడా అతనికే టైటిల్ సాధించే అవకాశాలున్నాయి.
వింబుల్డన్‌లో వరుసగా రెండేసి టైటిల్స్‌ను మూడు సార్లు సాధించిన జకోవిచ్ ఒక్కసారి కూడా హ్యాట్రిక్ కొట్టలేక పోయాడు. కానీ ఈసారి మాత్రం ఆ ఫీట్‌ను అందుకోవాలని తహతహలాడుతున్నాడు. గతంలో జకోవిచ్‌కు ప్రత్యర్థులుగా ఉన్న నాదల్, ఫెదరర్, ముర్రేలు ఈసారి బరిలో లేరు. ఫెదరర్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా నాదల్, ముర్రేలు గాయాలతో టోర్నమెంట్‌కు దూరమయ్యారు. ఇలాంటి స్థితిలో యువ ఆటగాళ్లు అల్కరాజ్, రూడ్, సిట్సిపాస్, మెద్వెదేవ్ తదితరులతో జకోవిచ్‌కు పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. అయితే వీరు జకోవిచ్‌కు గట్టి పోటీ ఇస్తారా అంటే సందేహమే. వింబుల్డన్‌లో జకోవిచ్‌కు కళ్లు చెదిరే రికార్డు ఉంది. ఇప్పటికే ఏడు సార్లు వింబుల్డన్ ఛాంపియన్‌గా ఉన్నాడు. ఈసారి కూడా టైటిల్‌పై కన్నేశాడు.