Saturday, November 23, 2024

జకోవిచ్‌ను ఊరిస్తున్న చారిత్రక విజయం!

- Advertisement -
- Advertisement -

Novak Djokovic going for history against diminished US Open

యూఎస్ ఓపెన్‌పై కన్నేసిన సెర్బియా యోధుడు

న్యూయార్క్: సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ చారిత్రక విజయానికి ఒక టైటిల్ దూరంలో నిలిచాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్) సరసన నిలిచాడు. ఇక ఈ నెల 30న ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు ఫెదరర్, నాదల్ దూరమయ్యారు. వీరితో పాటు ఆస్ట్రియా యువ సంచలనం డొమినిక్ థిమ్ కూడా గాయంతో యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. దీంతో జకోవిచ్‌కు చారిత్రక విజయం సాధించేందుకు మార్గం మరింత తేలికైందనే చెప్పాలి. డిఫెండింగ్ చాంపియన్ థిమ్‌తో పాటు నాదల్ కూడా ఈసారి బరిలోకి దిగడం లేదు. దీంతో జకోవిచ్‌కు యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సాధించడం పెద్ద ఇబ్బందేమీ కాదనే చెప్పాలి. జర్మనీ యువ సంచలనం అలెగ్జాండర్ జ్వరేవ్, గ్రీక్ వీరుడు సిట్సిపాస్‌తో మాత్రమే జకోవిచ్‌కు పోటీ నెలకొంది. వీరిద్దరిని ఓడించి యూఎస్ ఓపెన్‌ను గెలుచుకోవడం జకోవిచ్‌కు పెద్ద ఇబ్బందేమీ కాకపోవచ్చు.

ఒకవేళ నాదల్, థిమ్ బరిలో ఉంటే మాత్రం సెర్బియా స్టార్ జకోవిచ్‌కు కాస్త పోటీ ఎదురయ్యేదేమో. కానీ వీరిద్దరితో పాటు మరో దిగ్గజం ఫెదరర్ కూడా లేక పోవడం జకోవిచ్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఈ ఏడాది ఇప్పటికే వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించిన జకోవిచ్ యూఎస్ ఓపెన్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. అతని ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే సులువుగానే యూఎస్ ఓపెన్‌ను గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇక బరిలోకి దిగే మిగతా ప్రత్యర్థులు జకోవిచ్‌కు ఎంత వరకు పోటీ ఇస్తారనేది కూడా సందేహమే. అతని అనుభవం ముందు ప్రస్తుతం బరిలోకి దిగనున్న ఆటగాళ్లు అసలు పోటీలోకే రారంటే అతిశయోక్తి కాదు. నాదల్, ఫెదరర్‌లకు మాత్రమే జకోవిచ్‌ను మట్టికరిపించే సత్తా ఉంది. అంతేగాక మరో స్టార్ ఆండ్రీ ముర్రేకు కూడా గాయాలు ప్రతికూలంగా మారాయి. దీంతో అతని ఆట తీరును చాలా అధ్వాన్నంగా మారింది. ఇలాంటి స్థితిలో జకోవిచ్‌కు కేవలం జ్వరేవ్‌తో మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది.

కొంతకాలంగా జ్వరేవ్ నిలకడైన ఆటతో చెలరేగి పోతున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ విజయం జ్వరేవ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అంతేగాక తాజాగా ప్రతిష్టాత్మకమైన సిన్సినాటి ఓపెన్‌లో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. యూఎస్ ఓపెన్‌కు సన్నాహకంగా జరిగిన ఈ టోర్నీలో విజయం సాధించడంతో జ్వరేవ్‌లో కొత్త జోష్ నెలకొంది. ఇక కిందటిసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్న జ్వరేవ్ ఈసారి మాత్రం ఎలాగైనా యూఎస్ ఓపెన్‌ను సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. జ్వరేవ్‌తో పాటు సిట్సిపాస్, ఇటలీ ఆటగాడు బెర్రిటెని, రష్యా ఆటగాళ్లు రుబ్లేవ్, డానిల్ మెద్వెదేవ్ తదితరులు కూడా టైటిల్‌పై కన్నేశారు. వీరంతా బరిలో ఉన్నా ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా జకోవిచే కనిపిస్తున్నాడు. అతన్ని ఓడించి టైటిల్‌ను సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర ఆటగాళ్లకు చాలా కష్టంతో కూడుకున్న అంశంగా విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News