Saturday, November 23, 2024

టెన్నిస్ రారాజు జకోవిచ్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ సొంతం చేసుకున్నాడు. రష్యాకు చెందిన మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్‌తో జరిగిన ఫైనల్లో రెండో సీడ్ జకోవిచ్ 63, 76(7/5), 63తో విజయం సాధించాడు. ఈ గెలుపుతో జకోవిచ్ తన ఖాతాలో రికార్డు స్థాయిలో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను జత చేసుకున్నాడు. ఇదే క్రమంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా ఉన్న మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) రికార్డును నొవాక్ సమం చేశాడు.

ఇప్పటి వరకు ఆస్ట్రేలియా మాజీ టెన్నిస్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ గ్రాండ్‌స్లామ్‌లో 24 సింగిల్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సెర్బియా పోరాట యోధుడు జకోవిచ్ ఆ రికార్డను సమం చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చిరకాల ప్రత్యర్థి రఫెల్ నాదల్ (స్పెయిన్) పేరిట ఉన్న 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును జకోవిచ్ తిరగ రాసిన విషయం తెలిసిందే. తాజాగా యూఎస్ ఓపెన్ టైటిల్‌తో తన రికార్డును మరింత పదిలం చేసుకున్నాడు.

నాదల్ 22 సింగిల్స్ టైటిల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ ఏడాది జకోవిచ్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు యూఎస్ ఓపెన్‌ను కూడా జకోవిచ్ గెలుచుకున్నాడు. అయితే విం బుల్డన్ ఓపెన్‌లో మాత్రం ఫైనల్లో స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాస్‌తో చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఒకవేళ వింబుల్డన్ ఓపెన్ కూడా గెలిచి ఉంటే జకోవిచ్‌కు గోల్డెన్ గ్రాండ్‌స్లామ్ దక్కేది. యూ ఎస్ ఓపెన్‌లో అంచనాలకు తగినట్టు రాణించిన జకోవిచ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

ఆరంభం నుంచే..
ఇక డానిల్‌తో జరిగిన పోరులో జకోవిచ్ ఆరంభం నుంచే నిలకడైన ఆటను కనబరిచాడు. గతానికి భిన్నంగా ఈసారి ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. గ్రాండ్‌ఫైనల్స్‌లో తొలి సెట్‌ను కోల్పోవడం జకోవిచ్‌కు అనవాయితీగా వస్తోంది. కానీ యూఎస్ ఓపెన్‌లో మాత్రం ఆ అపవాదును చెరిపేసుకున్నాడు. అద్భుత షాట్లతో అలరించిన జకోవిచ్ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే 63తో అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ రెండో సెట్‌లో జకోవిచ్‌కు ప్రత్యర్థి మెద్వెదేవ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. డానిల్ అద్భుత పోరాట పటిమతో జకోవిచ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు.

అయితే టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో విజయం మాత్రం జకోవిచ్‌నే వరించింది. ఇక మూడో సెట్‌లో నొవాక్ పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లు గెలిచి చాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2021 యూఎస్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదేవ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం కూడా తీర్చుకున్నాడు. కాగా, మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News