Tuesday, September 17, 2024

పురుషుల టెన్నిస్‌లో కొత్త శకం!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: పురుషుల టెన్నిస్‌లో ఏకచక్రాధిపత్యం చెలాయించిన నొవాక్ జకోవిచ్ (సెర్బియా), రఫెల్ నాదల్ (స్పెయిన్)ల శకం ముగిసిందా అంటే విశ్లేషకులు అవుననే అంటున్నారు. నాదల్ ఇప్పటికే చాలా రోజులుగా అంతర్జాతీయ టెన్నిస్‌కు దూరంగా ఉన్నాడు. సెర్బియా యోధుడు ఒక్కడే కుర్రాళ్ల పోటీని తట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో జకోవిచ్ సాధించిన స్వర్ణ పతకమే దీనికి నిదర్శనంగా చెప్పాలి. అయితే ఈ ఏడాది జకోవిచ్ సాధించిన అతి పెద్ద విజయం ఇదొక్కటి మాత్రమే. ఇది తప్ప జకోవిచ్ ఈ సీజన్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని కూడా గెలువలేక పోయాడు. ఇది నిజంగా ఆశ్చర్య పరిచే అంశమే. కిందటి ఏ డాది ఏకంగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జకోవిచ్ ఈసారి మాత్రం ఒక్క టైటిల్ కూడా సాధించలేదు.

ఇక నాదల్ అయితే అసలు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పోటీలోనే లేకుండా పోయాడు. మరోవైపు యువ ఆటగాళ్లు జన్నిక్ సిన్నర్ (ఇటలీ), కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్)లు పురుషుల టెన్నిస్‌లో సరికొత్త స్టార్లుగా అవతరించారు. ఈ ఏడాది జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అల్కరాజ్, సిన్నర్‌లు రెండేసి టైటిల్స్‌ను గెలుచుకున్నారు. దీంతో టెన్నిస్‌లో వీరి శకం ప్రారంభమైందనే చెప్పాలి. అల్కరాజ్ వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను దక్కించుకున్నాడు. ఇక సిన్నర్ ఆస్ట్రేలియా, యూఎస్ ఓపెన్ విభాగంలో సింగిల్స్ విజేతగా నిలిచాడు.

భవిష్యత్తు కుర్రాళ్లదే..
స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని సమకాలికులుగా పేరున్న వారిలో జకోవిచ్ ఒక్కడే ప్రస్తుతం టెన్నిస్లో కొనసాగుతున్నాడు. జకోవిచ్ ఇప్పటికీ కూడా సత్తా చాటుతున్నాడు. కానీ ఫెదరర్ చిరకాల ప్రత్యర్థిగా పేరున్న నాదల్ మాత్రం రెండేళ్లుగా పూర్తిగా చతికిల పడ్డాడు. ఒకవైపు పెరుగుతున్న వయసు, మరోవైపు వరుస గాయాలు నాదల్ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చాయి. ప్రస్తుతం అతనున్న పరిస్థితులను గమనిస్తే యువ ఆటగాళ్ల పోటీని తట్టుకుని టైటిల్స్ సాధించడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి.

జకోవిచ్ ఒక్కడికి మాత్రమే కాస్త మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా అతను కూడా ఈ ఏడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించక పోవడం గమనార్హం. ఇలాంటి స్థితిలో రానున్న రోజుల్లో అల్కరాజ్, సిన్నర్, జ్వరేవ్, హుర్కాజ్, దిమిత్రోవ్, ఫ్రిట్జ్, పాప్రియన్ తదితరులు జోరు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో వీరి మధ్య గట్టి పోటీ జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు దశాబ్దాలుగా ప్రపంచ పురుషుల టెన్నిస్‌ను శాసించిన దిగ్గజ త్రయం ఫెదరర్, నాదల్, జకోవిచ్ శకం దాదాపు ముగిసిందనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News