వాషింగ్టన్ : కొవిడ్ 19 తోపాటు కొత్త కరోనా వేరియంట్ల నియంత్రణలో కూడా నొవావాక్స్ కొవిడ్ టీకా 90 శాతం సమర్థంగా పనిచేస్తోందని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ నొవావాక్స్ సోమవారం వెల్లడించింది. అమెరికా, మెక్సికోల్లో 18 ఏళ్లు దాటిన 30 వేల మందిపై తాజా గా భారీ స్థాయిలో అధ్యయనాలు జరిగాయి. వీటిలో మూడో వంతు ప్రజలు మూడు వారాల వ్యవధిలో రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. బ్రిటన్ వేరియంట్‌పై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని తేలింది. అనేక ఆరోగ్య సమస్యలున్న వృద్ధుల్లో కూడా ఈ టీకా సమర్ధంగా పనిచేస్తుందని ప్రభావ వంతమే కాకుండా సురక్షితమైనదని నిర్ధారణ అయిందని ఆ సంస్థ వివరించింది.
ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి కానీ, రక్తం గడ్డకట్టడం కానీ, గుండెకు సంబంధించిన సమస్యలు కానీ కనిపించలేదని పేర్కొంది. అమెరికాలో కరోనా టీకాలకు డిమాండ్ తగ్గినప్పటికీ, ప్రపంచ దేశాల్లో మాత్రం డిమాండ్ బాగా ఉంటోంది. నొవావాక్స్ టీకాను సులువుగా భద్రపర్చవచ్చు. అలాగే రవాణా చేయవచ్చు. అందువల్ల ప్రపంచ దేశాలకు డిమాండ్‌కు తగినట్టు సరఫరా చేయడంలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర వహిస్తుంది. సెప్టెంబర్ చివరి నాటికి తమ వ్యాక్సిన్‌కు అమెరికా, ఐరోపా తదితర దేశాల్లో అనుమతి లభిస్తుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చుతూ నెలకు 100 మిలియన్ డోసుల ఉత్పత్తిని చేయగల సామర్ధం తమకుందని వివరించింది. తమ వ్యాక్సిన్ డోసులు మొదట దిగువ, మధ్య తరగతి దేశాలకు వెళ్తాయని నొవావాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాన్లీ ఎర్క్ తెలిపారు.