సీరమ్‌తో కలిసి సరఫరా చేయనున్న కంపెనీ
గేయిథర్స్‌బర్గ్ : తమ కంపెనీ తయారు చేసిన కొవిడ్19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్‌తోపాటు ఇండోనేషియా,ఫిలిప్పీన్స్ దేశాల్లో దరఖాస్తు చేసినట్టు అమెరికా కంపెనీ నొవావాక్స్ తెలిపింది. ఈ మూడు దేశాల్లో వ్యాక్సిన్ సరఫరాకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)తో ఆ కంపెనీ ఒప్పందం చేసుకున్నది. ధనిక దేశాలకన్నాముందు తక్కువ ఆదాయ దేశాలకే తమ వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలని నిర్ణయించినట్టు ఆ కంపెనీ పేర్కొన్నది. పేద దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు కూడా ఈ నెలలోనే దరఖాస్తు చేయనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత బ్రిటన్, యూరప్,ఆస్ట్రేలియా,కెనడా,న్యూజీల్యాండ్ దేశాల్లోనూ అనుమతులు పొందనున్నట్టు తెలిపింది.
ఈ ఏడాది చివరి వరకు అమెరికాలో తమ వ్యాక్సిన్‌ను వినియోగించబోమని తెలిపింది. రెండు డోసుల ఈ వ్యాక్సిన్‌ను కొవిడ్ వైరస్ స్పైక్ ప్రోటీన్‌ను టార్గెట్‌గా రూపొందించారు. అమెరికా, కెనడాలో 30,000మందిపై జరిపిన ప్రయోగాల్లో 90 శాతం సమర్థతను కనబరిచిందని ఈ ఏడాది జూన్‌లో నొవావాక్స్ ప్రకటించింది. సైడ్ ఎఫెక్ట్ చాలా స్వల్పమని తెలిపింది. ఇప్పటికే చైనా తయారీ వ్యాక్సిన్లను తీసుకున్నవారికి బూస్టర్ డోస్‌గా తమ వ్యాక్సిన్‌ను వినియోగించడానికి ఇండోనేషియా ఆసక్తి చూపిందని తెలిపింది. సెప్టెంబర్ చివరికల్లా తమ వ్యాక్సిన్ ఉత్పత్తి నెలకు 10కోట్లకు, డిసెంబర్ వరకల్లా 15 కోట్లకు చేరుకుంటుందని నొవావాక్స్ తెలిపింది.