Monday, December 23, 2024

నవలను చిలికి తీసిన వెన్న

- Advertisement -
- Advertisement -

ఈ పుస్తకం ప్రముఖ రచయిత వి.రాజారామమోహనరావు గారి నవలా సమీక్ష లో భాగంగా వెలువడిన మూడవది. ఇప్పటికి ఆయన 137 నవలలు సమీక్షించారు. ఈ వ్యాస సంపుటిలో 67నవలల ప్రస్తావన ,వాటి పరిచయాలూ ఉన్నాయి. ఈ సమీక్షలు చేయటం ఆయనకెంతవరకూ లాభించిందో కానీ, పాఠకులకు మాత్రం నిస్సందేహంగా లాభిస్తుంది. ఇందులో క్లాసిక్స్ గా పేరొందిన రాజశేఖర చరిత్రము, వేయిపడగలు, నారాయణరావు, మాలపల్లి, మైదానం, అసమర్థుని జీవయాత్ర, మాలపల్లి, అల్పజీవి, చివరకు మిగిలేది , కాలాతీతవ్యక్తులు వంటి అనేక నవలలున్నాయి. వీటన్నిటిమీద అనేక సమీక్షలు, విమర్శలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.మరి రాజారామ్మోహనరావు గారి ప్రత్యేకత ఏమిటంటే విశ్లేషణకో కొత్త అర్థాన్ని కల్పించడం. తద్వారా పాఠకుడిలో ఆసక్తి పెంచటం. ఉదాహరణకు మాలపల్లి నవలను విశ్లేషిస్తూ ఈ నవలలో కథ ఒకపాయగాను, కథేతర అంశాలు మరోపాయగాను నడుస్తుంటాయి అని మనకో క్లారిటీ ఇస్తారు.

అలా విశ్లేషకుడికి ఆ అవగాహన ఉన్నప్పుడు నవలను పాఠకుడు సులభంగా అర్థం చేసుకుంటాడు.అప్పటి జైళ్ళన్నీ నరకకూపాలే అంటూ వివరంగా తెలియచేస్తారు రచయిత ఉన్నవవారు అని గ్రంథకర్త పేర్కొంటారు.అంటే నవలలో రచయిత ఏం చెప్పాలనుకుంటున్నారో గ్రహించే నైపుణ్యం కూడా విశ్లేషకుడికి ఉండాలి. సరళంగా , హాయిగా సాగే ఈ విశ్లేషణలన్నీ పాఠకుడికి అరవైఏడు నవలలు చదివిన అనుభూతి కలుగిస్తాయి. అది రాజారామ్మోహనరావు గారు సాధించిన నైతిక విజయం. వారు నవలను విశ్లేషించిన తీరు ముచ్చటేస్తుంది. సమీక్ష అంటే పొగడటమే కాదు,కథను చెప్పాలి.కథ వెనక నేపథ్యం చెప్పాలి.దాన్ని అప్పటి సామాజిక పరిస్థితులతో బేరీజు వేసి రచయిత ఎక్కడ నిలుచున్నాడో చెప్పాలి.వీటినన్నింటిని మంచి తూకమేసి అందిస్తారు వారు.ఇది విశ్లేషకుడిగా రాజారామమోహనరావు గారు ప్రదర్శించిన పరిణితి. డ్బ్భైలలో వచ్చిన నవలలన్నీ మధ్యతరగతిజీవితాల్లోకి తొంగిచూసినవే అంటారు.

పెంకుటిల్లు నవలను విశ్లేషిస్తూ ఈ నవలా కాలానికి ‘పెంకుటిల్లు‘ మధ్యతరగతికి ఒక ప్రతీక అంటారు.పెంకుటిల్లు రాసే నాటికి అంటే దాదాపు 62ఏళ్ళకితంనాటికి శరత్ బాబు బెంగాలీ నవలల ప్రభావం తెలుగు నాట ఇంకా బలంగా ఉంది.అందుకే అనుకుంటా ఆ నవలలో ధీరోదాత్త పాత్రలు లేదంటారు గ్రంథకర్త.అందరూ పిరికితనాన్ని మోసిన బలహీనులు, బద్ధకస్తులు. ఇలాంటి వ్యాఖ్యానం పాఠకుడి గుండె తలుపు తడుతుంది.జి.వి.కృష్ణారావు ‘కీలుబొమ్మలు‘ సమీక్షిస్తూ గ్రంథకర్త ఈ నవల మంచి క్లిష్టమైన నవలా శిల్పానికి ఓ ఉదాహరణ అంటారు.అబద్ధం ఎంతో శక్తివంతమైనదన్న ప్రాతిపదిక తో ఈనవల రాశారు జి.వి.కృష్ణారావు అనేది వారి పరిశీలన.అలాగే ఈ నవలను గబగబా చదువుకుంటూ వెళ్ళలేం అని కూడా అంటారు.ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు- ఆమె‘ నవలను ప్రస్తావిస్తూ,నవల మొత్తం డైరీల రూపంలో ఉండటం ఈ నవల ప్రత్యేకత.

మొత్తం ఆరుపాత్రలుంటే ఆరుపాత్రలు రాసిన డైరీలే ఈనవల.అరవైయేళ్ళ తెలుగు వారి జీవితానికి రికార్డు లాంటిదీ నవల అంటూనే ఈ నవలను ఆగి ఆగి ముందుకు వెనక్కు జరుగుతు చదువుకోవాలంటారు రాజారామ్మోహనరావు.కొన్ని మనం వినని నవలలను రాజారామ్మోహనరావు ప్రస్తావించారని చెప్పుకున్నాం కదా.అలాంటి ఒక నవలడా.పరుచూరి రాజారాం గారి నవల ‘మబ్బు విడిచిన వెన్నెల‘ను పరిచయం చేస్తూ వైద్యవృత్తిపరమైన మంచి నవలకు ఈ నవలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటారు.ఇలాంటి వాక్యాలు పాఠకుడికి కావలసిన స్పష్టతనిస్తాయి.మరో అంశం కూడా ఇక్కడ చెప్పుకోవాలి.కథావస్తువును, కథనాన్ని చాలా తేటతెల్లంగా చెబుతారు రాజారామ్మోహనరావు.అందువలన పాఠకుడు నవల చదివిన అనుభూతి పొందుతాడు.శ్రీపాదసుబ్రమణ్యశాస్త్రి గారు ఏడు నవలలు రాశారన్న సమాచారం వారి ‘ఆత్మబలి‘ నవల విశ్లేషణ చదువుతుంటే తెలిసింది.

ఈ నవల బాల్య వివాహాలతో వితంతువులయిన స్త్రీల మనోభావాలెలా ఉంటాయో చెబుతూ వారి కాంక్షలు, కోరికలను చర్చించటం శ్రీపాద వారి ధైర్యాన్ని సూచిస్తుందంటారు.కానీ వారి ఇంగితం,తన వ్యక్తిగత అభిమానం వల్ల సమాజ సంతులనం చెడిపోకూడదు అని కూడా వారు భావించేవారని ‘ఆత్మబలి‘ నవల మనకు చెబుతుందంటారు ఈ గ్రంథకర్త.అలా నవల ఆత్మ ను పట్టుకుంటారు రచయిత రాజారామ్మోహనరావు.చాలామంది విమర్శ వ్యాసాలు రాస్తారు.దాన్ని మార్క్సిస్టు దృక్పథంతోనో, హేతువాదం కళ్ళద్దాలతోనో చూసి వ్యాఖ్యానిస్తుంటారు.ఈ రచయిత అందుకు భిన్నం.జీవితాన్ని ఎలా విశ్లేషించాడు ఈ నవలాకారుడు,కథను ఏవిధంగా నడిపాడు,పాత్రౌచిత్యం ఏమేరకు ఫలించింది వంటి ప్రాథమిక అంశాల ఆధారంగా చేస్తాడు.అది అరుదుగా కనిపించే ధోరణిగా భావించవచ్చు.మనం చాలా నవలలు పేర్లు వినుంటాం కానీ,ఆ నవలలు చదివి ఉండం.
బీనాదేవి గారి హేంగ్ మీ క్విక్, రావిశాస్త్రి గారి అల్పజీవి, శేషేంద్ర శర్మ కామోత్సవ్ కొన్ని చెప్పుకోవాలంటే.

ఆ నవలలు చదవని వారికి ఆ నవలల విశ్లేషణ బోనస్ గా లభిస్తుంది.స్వాతంత్య్ర పోరాటంలో తెలుగు వారి పాత్రను వివరించే రెండు నవలలు ఆసక్తిగా ఉంటాయి.ఒకటి అరవిందగారి ‘జీవనది‘మరొహటి మహీధర రామ్మోహనరావు గారి ‘రథ చక్రాలు‘.ఒకటి గాంధేయ వాదానికి కట్టుబడి ఉంటేమరొకటి కాంగ్రెస్ వారిని ప్రభావితం చేసిన కమ్యూనిస్టు సిద్దాంతం నేపథ్యం.రెండు నవలలు నాటి సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి.వీరేశలింగము గారి ‘రాజశేఖర చరిత్రము‘ తొలి తెలుగు నవల అవునా కాదా అన్న మీమాంస ఇప్పటికీ కొంతమందిలో కొనసాగుతున్నా రచయిత రాజారామ్మోహనరావు రాజశేఖర చరిత్రము పట్ల వకాల్తా పుచ్చుకుంటారు.ఈనవల విశ్లేషణ ఎంతో ఉత్తేజితంగా అనిపిస్తుంది.అందుకు కారణం వీరేశలింగం గారి నవలను నడిపిన విధానమయుండొచ్చు అని పాఠకుడికి ఖచ్చితంగా తోస్తుంది.రాజశేఖర చరిత్రము లాంటి తొలి నవలను ఎంత నేర్పుగా విశ్లేషించారో, మరింత షార్పు గా వివరించిన నవల ఒకటుంది.

అది చంద్రశేఖర్ ఆజాద్ గారి ‘గట్టుమీద చేప‘ నవల.సాఫీగా నడుస్తున్న జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకునేందుకు వ్యామోహాలు ఎలా పుట్టుకొస్తాయో చెబుతుందీ నవల.నాందీ ప్రస్తావనగా తెలుగు నాట వివిధ వ్యామోహాలు పంటను నాశనం చేసే కలుపు మొక్కల్లా ఎలా ఉద్భవించాయో వివరిస్తారు గ్రంథకర్త. ఈవ్యామోహాల ఉటంకింపు ఆసక్తిగానే ఉంటుంది పాఠకుడికి.ఇలా విశ్లేషిస్తూ పోతే అరవై ఏడు నవలలను రచయిత రాజారామ్మోహనరావు ఎలా విశ్లేషించారో చెప్పాలన్న దుగ్ధ మొదలవుతుంది.అందుకని కొన్ని మచ్చుకు క్లుప్తంగా వారి విశ్లేషణను ఆధారం చేసుకుని చెప్పటం జరిగింది.ఇన్ని నవలలు మనకు చదివే అవకాశం రాకపోవచ్చు.స్థూలంగా ఆయా నవలల స్థల కాలాదులు పరిచయమవుతాయి మనకు.అన్నీ ఒకే గాటన కట్టలేం కొన్ని ఆకట్టుకుంటే కొన్ని అంతగా ఆకట్టుకోవు.

ఉదాహరణకు ‘పల్లె -పట్నం‘ నవల గొప్ప గొలుసు నవలగా రచయిత పేర్కొన్నారు.దాన్ని పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు, ఆరుద్ర, మద్దిపట్ల సూరి,కె.రామలక్ష్మి,ప్రఖ్యా శ్రీరామమూర్తి కలిసి రచించారు.చిన్న నవలే అయినా విశ్లేషణ సాఫీగా సాగదు. రచయిత రాజారామ్మోహనరావు దృష్టిలో అదో మంచినవల.కానీ పాఠకుడిలో గందరగోళం సృష్టిస్తుంది.అదే మాలతీచందూర్ గారి ‘సద్యోగం‘ నవల తార్కిక అంశాల ఆధారంగా సాగుతుందంటారు రాజారామ్మోహనరావు . కాబట్టి కథ తక్కువ,వాదనలెక్కువ అంటారు ,కానీ పాఠకుడిలో ఉత్సాహన్ని పోగుచేస్తుందీ నవల.ఇలా ఈ నవలాహృదయం3 లో విశ్లేషించిన నవలలు తెలుగు నవలా పయనం ఎగుడుదిగుడులను చూపిస్తాయి.కొన్ని పరిష్కారాన్ని సూచిస్తాయి.కొన్నింటిలో కథనం బావుందనిపిస్తుంది.కొన్నింటిలో పాత్రలను మలిచిన తీరు బావుందనిపిస్తుంది. కొన్నింటి కథనం సినిమాలను తలపిస్తున్నాయనిపిస్తుంది.

ఒకటి మాత్రం స్పష్టం. రచయిత రాజారామ్మోహనరావు గారి విశ్లేషణ చాలా సైంటిఫిక్ గా సాగింది.ఆయన చాలా సందర్భాలలో నవల విశ్లేషణ కోసం ఆయన అదనపు సమాచారాన్ని పొందుపరుస్తారు.సాధారణంగా ఇలాంటి విశ్లేషణలలో చోటు దక్కని ఇద్దరు రచయితల గురించి కూడా చెప్పుకోవాలి.ఒకరు యండమూరి వీరేంద్రనాథ్ మరొకరు మల్లాది వెంకట కృష్ణమూర్తి. వీరేంద్రనాధ్ గారి ‘అంతర్ముఖం‘, మల్లాది ‘అందమైనది జీవితం‘.వీరిద్దరిలో ఎవరి రచనలు బావుంటాయనే చర్చలు, వాదనలు మనకు సుపరిచయమే.మరి గ్రంథకర్త ఎటువైపున్నారని అనుమానమొస్తుంది.అయితే అన్ని నవలలను న్యూట్రల్ అబ్జర్వర్ గా విశ్లేషించి,తనమీద ఎలాంటి ముద్రా పడకుండా ఉండాలని రచయిత భావించినట్టుంది.

అందుకే విశ్లేషణ పకడ్బందీగా చేస్తారు.నాలుగు వందల డ్భె పేజీల పుస్తకం చకచకా సాగిపోతుంది.అప్పట్లో సినిమా కుటుంబ చిత్రాలకు పాపులర్.డ్బ్బైలలో వచ్చిన తెలుగు నవలలు కుటుంబ నవలలుగా స్థిరపడి ఆ బంధాన్ని సుసంపన్నం చేశాయనిపిస్తుంది. తెలుగు నవల వికాసం,ఉత్థాన పతనాలు స్పష్టంగా చూపించే గ్రంథమిది. తెలుగు నవలను ప్రేమించే పాఠకులు తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం నవలా హృదయం- 3 విమర్శ వ్యాసాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News