Sunday, December 22, 2024

నేడు దీక్షా దివస్…ఉద్యమానికి ఊపిరిలూదిన రోజు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు
‘కెసిఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో’ అంటూ నినదించి ఆమరణ దీక్షకు పూనుకుని ఉద్యమానికి ఊపిరిలూదిన కెసిఆర్
”కెసిఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో” అంటూ కెసిఆర్ చేసిన నినాదం తెలంగాణ రణనినాదమైంది

మనతెలంగాణ/హైదరాబాద్: నవంబర్ 29…తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి ఆ రోజునే బీజం పడింది. ఇదే రోజున ‘కెసిఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో’ అంటూ నినదించి కెసిఆర్ ఆమరణ దీక్షకు పూనుకుని ఉద్యమానికి ఊపిరిలూదారు. ఫలితంగా డిసెంబర్ 9న కేంద్రం దిగి వచ్చి తెలంగాణపై ప్రకటన చేసింది.అప్పటి కేంద్రమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ప్రకటించారు. అప్పటి యుపిఎ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోవడంతో ఉద్యమనాయకుడిగా ఉన్న కెసిఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారు. చావు నోట్లో తలపెట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తేవడంలో సఫలీకృతులయ్యారు.

దీక్షకు ముందు రోజు అంటే 2007, నవంబర్ 28న కరీంనగర్‌కు చేరుకున్న చంద్రశేఖర్ రావు..మరుసటి రోజు 29న దీక్షాస్థలి సిద్ధిపేటకు కరీంనగర్ నుంచి జయశంకర్ సార్‌తో కలిసి బయలుదేరగా అల్గునూర్ చౌరస్తా వద్ద పోలీసులు అదుపులో తీసుకుని వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలించారు.ఈ సంఘటన తెలంగాణను కుదిపేసింది. కెసిఆర్ దీక్షకు ఉపక్రమించకుండా అదుపులోకి తీసుకోవడం తెలంగాణ ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. ఖమ్మంలో ఆరోగ్యం క్షీణించిన కెసిఆర్‌ను డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తరలించే క్రమంలో రికార్డైన కెసిఆర్ విజువల్స్‌ను చూసిన తెలంగాణ ప్రజలు తట్టుకోలేక విలవిలలాడారు. తమ నాయకుడు అచేతన వ్యవస్థలో ఉన్నాడన్న విషయం తెలిసి ఆందోళనకు గురయ్యారు.

ఉధృత రూపం దాల్చిన ఉద్యమం
ఉమ్మడి పాలకుల వ్యవహారాలన్నీ ఉద్యమకారులను అవమానించేలా, రెచ్చగొట్టేలా ఉండటంతో ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. కెసిఆర్‌ను నిమ్స్ ఆసుపత్రికి తరలించేటప్పుడు “కెసిఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో” అని కెసిఆర్ చేసిన నినాదం తెలంగాణ రణనినాదమైంది. దీంతో తెలంగాణ అంతా అల్లకల్లోలమైంది. ప్రజలు భగ్గుమన్నారు. బస్సులు, రైళ్లు బంద్ అయ్యాయి. ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారు. కెసిఆర్ అరెస్టును తట్టుకోలేక శ్రీకాంతాచారి ఎల్‌బినగర్‌లో అగ్గికి ఆహుతయ్యారు. పిల్లల ఆత్మహత్యలు చూసి ఉద్యమ సారథి కెసిఆర్ కన్నీళ్లు కార్చారు.

కెసిఆర్ పట్టువిడకుంటా కొనసాగిస్తున్న దీక్షతో రగిలిన తెలంగాణ దెబ్బకు కాంగ్రెస్ కోర్ కమిటీ ఢిల్లీలో డిసెంబర్ 9న ఐదుసార్లు సమావేశమైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్యను హైదరాబాద్ విమానం ఎక్కించారు. రాత్రి 11.30 గంటలకు ఢిల్లీలో చిదంబరం మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారు. కెసిఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవిర్భవించడానికి కారణమైంది. అప్పటినుంచి నవంబర్ 29వ తేదీని ప్రతి ఏటా దీక్షా దివస్‌గా నిర్వహించుకుంటూ తెలంగాణ సమాజం స్పూర్తి పొందుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ఒక్క రోజు ముందు జరుపుకుంటున్న దీక్షా దివస్ ప్రతీ తెలంగాణ బిడ్డలో ఉద్యమ స్పూర్తిని నింపి తెలంగాణ విజయాల పరంపరను కొనసాగించనున్నది.

సబ్బండ వర్గాలను కదిలించిన కెసిఆర్ ఆమరణ దీక్ష
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2007 నవంబర్ 29న కెసిఆర్ ప్రారంభించిన ఆమరణ దీక్ష తెలంగాణలోని సబ్బండ వర్గాలను కదిలించింది.అన్ని వర్గాల ప్రజలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ కోసం పోరాటం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News