న్యూఢిల్లీ: కుటుంబ పెద్ద అనుమతితో ఆధార్ కార్డు హోల్డర్లు తమ అడ్రసును ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడిఎఐ) మంగళవారం అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. అయితే ప్రూఫ్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబ పెద్ద ధ్రువీకరణ ఓటిపి ద్వారా తప్పనిసరి. అనేక కారణాల వల్ల వేర్వేరు ప్రదేశాలకు, నగరాలకు మారే వారికి ఈ ఆన్‌లైన్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా వ్యాలిడ్ ప్రూఫ్ ద్వారా అడ్రసు మార్చుకోవడం అన్నది ఓ కొత్త ఆప్షన్.
రెసిడెంట్స్ అడ్రస్ మార్చుకోవడం కోసం ‘మై ఆధార్’ పోర్టల్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవాలి. సర్వీసు ఫీజు కింద రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ నంబర్(ఎస్‌ఆర్‌ఎన్) అందుకుంటారు. కుటుంబ పెద్దకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం వెళుతుంది. దానికి కుటుంబ పెద్ద ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా ప్రాసెస్ పూర్తవుతుంది. ఒకవేళ కుటుంబ పెద్ద తిరస్కరిస్తే అడ్రస్ మార్పును ఆమోదించరు. రిక్వెస్ట్‌ను మూసేస్తారు. ఎట్టి పరిస్థితిలోనూ చెల్లించిన సర్వీసు ఫీజును తిరిగి ఇవ్వరు.