Monday, January 20, 2025

బండ్ల గణేశ్‌‌‌పై నౌహీరా షేక్ సంచలన ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరా గోల్డ్ స్కా మ్‌లో ప్రధాన నిందితురాలు, హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ బండ్ల గణేష్‌పై సంచలన ఆరోపణలు చేశారు. బండ్ల గణేశ్ తన ఇంటిని కాజేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని తన కార్యాలయంలో నౌహీరా షేక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రూ.75 కోట్ల విలువ చేసే తన ఇంటిని బండ్ల గణేష్ కబ్జా చేయాలని ఆయన ప్రణాళిక వేశారని ఆమె ఆరోపించారు. ఫిలింనగర్ లో ఉన్న సుమారు రూ.75 కోట్ల విలువైన తన ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్‌ను బండ్ల గణేశ్‌కు అద్దెకిచ్చామని నౌహీరా షేక్ చెప్పారు. 2021 జూన్ 5న ఆయనకు అద్దెకు ఇచ్చామని 11 నెలలు రెంటల్ అగ్రిమెంట్ కూడా చేశామని నౌహీరా షేక్ వెల్లడించారు. అద్దె గడువు ముగిసినా కూడా తన ఇంటిని బండ్ల గణేష్ ఖాళీ చేయలేదని ఆరోపించారు.

ఇడి అధికారులు తన ఇంటిని అటాచ్ చేశారని తెలుసుకున్న బండ్ల గణేశ్ అడ్డదారిలో ఇల్లు మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారన్నారు. 11 నెలలు చేసిన రెంటల్ అగ్రిమెంట్‌ను ఫోర్జరీ చేసి 9 ఏళ్లు అద్దెకు తీసుకున్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడని ఆరోపించారు. తక్కువ ధరకు ఇంటిని అమ్మాలంటూ ఒత్తిడి కూ డా తనపై తీసుకువస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటికి గత గురువారం మధ్యా హ్నం తాను వెళ్లగా రౌడీల సాయంతో దౌర్జన్యానికి దిగారని వివరించారు. పైగా తనపైనే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఇంటిని ఆక్రమించుకున్న బండ్ల గణేశ్‌పై చర్యలు తీసుకోవాలని తాను పోలీస్ ఫిర్యాదు ఇస్తే పోలీసులు ఆయనకే మద్దతుగా ఉన్నారని అన్నారు. ఈ వైఖరిపై తాను డిజిపికి ఫిర్యాదు చేశానని చెప్పారు. సోమవారం ఈ విషయంలో తాను సిపిని కలుస్తానని చెప్పారు. తనకు రాజకీయ నాయకులు తెలుసునని బండ్ల గణేశ్ బెదిరిస్తున్నారన్నారు.

నౌహీరా షేక్ ఆరోపణలు చేయడానికి ముందు రోజే ఈ విషయంలో బండ్ల గణేష్ కుమారుడు పోలీసులను ఆశ్రయించారు. ఇడి కస్టడీలో ఉన్న ఇంటిని తమకు అమ్మాలని ఆమె ప్రయత్నించిందని.. తమ వద్ద డబ్బు తీసుకుని మరీ ఇంటిని ఖాళీ చేయాలంటూ రౌడీలతో దౌర్జన్యానికి దిగుతోందంటూ నౌహీరా షేక్‌పై ఫిర్యాదు చేశాడు. నౌహీరా షేక్ తాము అద్దెకు ఉంటున్న ఇంటిని అమ్ముతున్నట్లుగా చెప్పడంతో తామే కొంటామని, గత ఏడాది మార్చి 23న ఆమెకు రూ.3 కోట్లు అడ్వాన్స్‌గా ఇ చ్చామని బండ్ల కుమారుడు వివరించారు. మిగతా మొత్తాన్ని కూడా జమ చేస్తున్న సమయంలో ఆ ఇల్లు ఈడీ కస్టడీలో ఉందని తెలిసిందన్నారు.అయితే తాము ఆ ఇంటిని కొనడం లేదని తేల్చేశామని చెప్పారు. నౌహీరా మాత్రం మిగతా డబ్బులు చెల్లించేదాకా ఒత్తిడి తెచ్చిందన్నారు. తమ అడ్వాన్స్ డబ్బులు రూ.3 కోట్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు.

ఈ నెల 15న మధ్యాహ్నం నౌహీరా షేక్ 10 మంది రౌడీలతో కలిసి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిందని ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడిందని, అసభ్య పదజాలంతో దూషించిందని బండ్ల కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. హీరో గోల్డ్ గ్రూప్ అధినేత్రి అయిన నౌహీరా షేక్ రూ.5 వేల కోట్ల విలువైన మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సంగతి విదితమే. ఈ కేసులో ఇడి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్ర మంలో ఆమెకు చెందిన భూముల్ని, ఆస్తుల్ని కూడా ఇడి జప్తు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News