Monday, December 23, 2024

ఎక్కడా సురక్షితంగా ఉన్నాననుకోవడం లేదు

- Advertisement -
- Advertisement -

Nowhere feels safe at this moment: Leena Manimekalai

కాళీ వివాదంపై లీనా మణిమేఖలై వ్యాఖ్య

న్యూఢిల్లీ: ప్రస్తుతం తాను ఎక్కడా సురక్షితంగా ఉన్నట్లు భావించడం లేదని కాళీమాతపై డాక్యుమెంటరీని నిర్మించి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న దర్శకురాలు లీనా మణిమేఖలై గురువారం వ్యాఖ్యానించారు. ఇటీవల ఆమె విడుదల చేసిన చేతిలో సిగరెట్టు, ఎల్‌జిబిటిక్యు(స్వలింగ సంపర్కులు) జెండాను ధరించిన కాళీమాత పోస్టరుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన దరిమిలా మణిమేఖలైపై అనేక చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇటీవల గార్డియన్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూను గురువారం ట్విటర్‌లో షేర్ చేసిన మణిమేఖలై అతిపెద్ద ప్రజాస్వామ్యం నుంచి ఇప్పుడు అతిపెద్ద విద్వేష యంత్రాంగంగా దిగజారిపోయిన యావద్దేశం తనను సెన్సార్ చేయాలనుకుంటున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. గత వారం ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు 2లక్షలకుపైగా ఖాతాల నుంచి ఆన్‌లైన్‌లో బెదిరింపులు వచ్చాయని ఆమె తెలిపారు. ఈ ఆన్‌లైన్ బెదిరింపులను అతివాద హిందూ గ్రూపులు చేస్తున్న మూకుమ్మడి దాడులుగా టోరంటోకు చెందిన మణిమేఖలై అభివర్ణించారు.

తాను తీసిన డాక్యుమెంటరీ కాళీమాతను లేదా హిందూత్వాన్ని అగౌరవపరిచే విధంగా ఉండదని తన ఇంటర్వూలో ఆమె తెలిపారు. తమిళనాడులోని ఒక హిందువు కుటుంబంలో పెరిగిన తాను ఇప్పుడు నాస్తికురాలినని ఆమె చెప్పారు. తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాళీమాతను క్షుద్ర దేవతగా కొలుస్తారని, ఆ దేవత మేక రక్తంతో వండిన మాంసాన్ని భుజించి, సారా తాగి, బీడీ(సిగరెట్) తాగి, ఆనంద తాండవం చేస్తుందని, అదే విషయాన్ని తన చిత్రంలో చూపానని మణిమేఖలై పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌లో మణిమేఖలైపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు వేర్వేరుగా నమోదయ్యాయి. భోపాల్, రాజస్థాన్‌లో కూడా బుధవారం రెండు కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News