సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై చర్చ
నగర పోలీసులకు శిక్షణ ఇవ్వనున్న ఎన్‌పిఏ
మనతెలంగాణ, సిటిబ్యూరో: సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై నగర పోలీసులకు ఎన్‌పిఏలో శిక్షణ ఇప్పించనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎన్‌పిఏ డైరెక్టర్ అమిత్ గార్గ్, మిగతా టీం మధుసూదన్ రెడ్డి, ఐబి జాయింట్ డైరెక్టర్ సంబందన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్, సౌత్ సిఆర్‌పిఎఫ్ ఐజి మహేష్ చంద్రలడ్డా తదితరులు సమావేశమయ్యారు. సమావేశంలో సైబర్ నేరాల పరిశోధన, శిక్షణ, మాదక ద్రవ్యాల కేసుల పరిశోధనకు కావాలసిన శిక్షణ ఇచ్చుట, డార్క్‌వెబ్, క్రిప్టో కరెన్సీ వాడకంపై నిఘా, సైబర్ నేరాలు, డ్రగ్స్‌లో ఆఫ్రికన్స్, నైజీరయన్ల పాత్ర, వారిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
ఎన్‌పిఏ సిబ్బంది పేర్కొన్న అంశాలకు సంబంధించిన హైదరాబాద్ పోలీసు సిబ్బందికి ప్రత్యేక మాడ్యూల్స్ నిర్వహించి, ఆచరణాత్మక అవగాహన కల్పించాలని నిర్ణయించారు. సైబర్ నేరాల పరిశోధన సాధనాలను బలోపేతం చేసి ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో వాటికి సంబంధించిన శిక్షణ అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌పిఏ డైరెక్టర్ సూచనల మేరకు హైదరాబాద్ నగర పోలీస్ స్టేషన్ల పనితీరు, నగరంలోని వినాయక చవితి వంటి పండుగల సమయంలో బందోబస్తు, ప్రణాళిక, నిర్వహణ వంటి విషయాల గూరించి ప్రొబేషనరీ ఐపిఎస్‌లకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అంగీకరించారు.