Wednesday, January 22, 2025

బ్రాండ్ అంబాసిడర్లు మీరే

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి, మన ఊరు మన బడి పథకంపై ఎన్‌ఆర్‌ఐలతో ముఖాముఖీలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: విదేశాల్లో తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు ఎన్‌ఆర్‌ఐలేనని మంత్రి కెటిఆర్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో మీట్ అండ్ గ్రీట్ విత్ కెటిఆర్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకంపై ఎన్‌ఆర్‌ఐలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ‘గుడులు కట్టించే వారు గుడులను కట్టించండి.. బడులు కట్టించే వారు బడులు కట్టించండి.. లైబ్రరీలు కట్టించే వారు లైబ్రరీలు కట్టించండి.. దీని వల్ల స్థానికుల నుంచి వచ్చే కృతజ్ఞ మరిచిపోలేనిదిగా ఉంటుందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. మీకు మించిన బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరూ ఉండరు. తెలంగాణ గురించి మీరే గొప్పగా ప్రచారం చేయగలరు. అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం. విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణలో కేవలం మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని కెటిఆర్ తెలిపారు. అలా వైద్య విద్యతో పాటు స్కూల్ ఎడ్యుకేషన్‌ను పటిష్టం చేస్తున్నాం’ అని కెటిఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.7,230 కోట్లతో 26 వేల పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని కెటిఆర్ అన్నారు. ఈ విద్యా యజ్ఞంలో మీరు కూడా పాల్గొనాలని ఎన్‌ఆర్‌ఐలను కెటిఆర్ కోరారు. మాతృభూమి కోసం ఏదైనా చేయాలనుకునే వారు విద్యాయజ్ఞంలో పాల్గొనవచ్చని చెప్పారు. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా.. ప్రైవేట్ వ్యక్తులు కూడా భాగస్వాములు కావాలన్నారు. మీకు నచ్చిన స్కూల్‌ను ఎంచుకుని అభివృద్ధి చేయవచ్చని ఎన్‌ఆర్‌ఐలకు సూచించారు. ‘దేశానికే హై-దరాబాద్ కేంద్రంగా.. హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్రం ఏర్పడ్డాక మౌలిక వసతులకు పెద్ద పీట వేశాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌లో హైదరాబాద్, బెంగళూరు కంటే మెరుగ్గా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కూడా హైదరాబాద్ మెరుగ్గా ఉంది. బెంగళూరులో ఐటీ రంగంలో పనిచేసే వారు 40 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లినవారే. బల్క్, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో దేశానికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది’ అని కెటిఆర్ అన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

‘ఇండియాలో ఎగురుతున్న ఏకైక గెలుపు పతాకం తెలంగాణ మాత్రమే. అన్ని రంగాల్లో విజేతగా నిలిచిన తెలంగాణ సక్సెస్ స్టోరీని చెప్పడానికే అమెరికా వచ్చాను. కాళేశ్వరం ప్రాజెక్టుతో దేశానికే తెలంగాణ ధాన్యాగారంలా ఉంది. తెలంగాణ పంటలను భారత ఆహార సంస్థ కొనలేకపోతోంది. ఇంటింటికి నల్లాతో దేశానికి తెలంగాణ దార్శనికత తెలిసింది. టిఎస్ ఐపాస్‌తో 2.3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. తెలంగాణ తలసరి ఆదాయం రెండు లక్షల డ్బ్బై వేల రూపాయలని.. తెలంగాణ విజయగాథను మంత్రి కెటిఆర్ వినిపించారు. ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్టర్స్ రౌండ్ టేండ్ సమావేశంలో పాల్గొన్న మంత్రి కెటిఆర్.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News