న్యూఢిల్లీ: జాతీయ స్టాక్ ఎక్స్‌ఛేంజీ మాజీ సిఇఒ చిత్రా రామకృష్ణను ఏడు రోజుల సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో-లొకేషన్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రను సిబిఐ ఆదివారం ఢిల్లీలో అరెస్ట్ చేసింది. ఆమెను సిసిటివి పర్యవేక్షణలోనే విచారించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఆమె తరఫు న్యాయవాదుల ప్రతిరోజు సాయంత్రం కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, ప్రతి 24 గంటలకు ఒకసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. దర్యాప్తుకు చిత్ర సహకరించడంలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2500కు పైగా ఈమెయిల్స్ విషయంలో ఆమె నేరారోపణ ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. ఇదిలావుండగా ‘హిమాలయ యోగి’ని గుర్తుపట్టేందుకు ఆమె నిరాకరిస్తున్నారని సిబిఐ కోర్టుకు తెలిపింది.
సిబిఐ వాదనలు విన్న న్యాయస్థానం, దర్యాప్తు ఎందుకు స్లోగా నడుస్తోందని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఇతర నిందితుల సంగతేమిటని నిలదీసింది. ప్రయోజనాలు పొందినవారిలో వారే ముఖ్యులని, ఎఫ్‌ఐఆర్ నమోదై నాలుగేళ్లయినా వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తదుపరి విచారణ తేదిన(మర్చి 14న) చిత్రను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
NSE Fraud: CBI take 7 days custody to Chitra Ramakrishna