Friday, November 22, 2024

చంద్రబాబుకు భద్రత పెంపు

- Advertisement -
- Advertisement -

ఎపి రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతాయన్నది అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా టిడిపి నేతల మీద ఎపిలో అక్కడక్కడ దాడులు కొనసాగు తున్నాయి. ఈ క్రమంలో ఎపిలో చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో టిడిపి శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తుంది. ఇక చంద్రబాబుకు ఎన్నికల ముందు ప్రచారం నిర్వహించే క్రమంలో కూడా ఆయన భద్రత విషయంలో అనేకమార్లు రాజకీయ వర్గాలలో చర్చ జరిగింది. ఎపిలో చంద్రబాబు కు భద్రతపై ఆందోళనల క్రమంలో టిడిపి అధినేత నారా చంద్రబాబుకు కేంద్రం భద్రతను పెంచింది. గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రత అధికారులు చంద్రబాబు నివాసం వద్ద ఆయన సంచరించే అన్ని ప్రదేశాలను పరిశీలించారు. టిడిపి కార్యాలయం వద్ద, కరకట్ట వద్ద, చంద్రబాబు నాయుడు నివాసం వద్ద, అలాగే గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి కరకట్ట మార్గాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు.

చంద్రబాబు భద్రతకు భంగం వాటిల్లకుండా , చంద్రబాబు నాయుడుకి భద్రత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు చంద్రబాబు నివాసం వరకు 12 x 12 రెండు బ్యాచులు గా 24 మంది ఎస్‌పిజి బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయించారు. ప్రస్తుతం చంద్రబాబుకు ఇంత ఎందుకు భద్రత పెంచారు అన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చగా మారింది. ఆయనకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఇంటిలిజెన్స్ నివేదికలు ఇచ్చిందా? ఎందుకీ భద్రత పెంపు? అనేది ఆసక్తికరంగా మారింది. ఒక పక్క ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు రక్షణ తగ్గించిన కేంద్రం, ప్రస్తుతం చంద్రబాబుకు రక్షణ పెంచటం ఢిల్లీ పొలిటికల్ వర్గాలలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇక ఎపిలోనూ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, హింసాత్మక ఘటనలు, టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య కొనసాగుతున్న దాడులు, అభ్యర్థుల పైన కూడా కొనసాగుతున్న ఎటాక్‌లు వెరసి జూన్ నాలుగు వరకు శాంతి భద్రతల విషయంలో ఎపిలో కొనసాగుతున్న ఆందోళనల నేపధ్యంలో చంద్రబాబుకు భద్రత పెంపు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నట్లైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News