న్యూఢిల్లీ : నీట్ యుజి, యుజిసి నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగినందుకు నిరసనగా కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) సభ్యులు గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ప్రధాన కార్యాలయం లోకి దూసుకుని చొరబడ్డారు. ఢిల్లీలోని ఓఖ్లాలో ఎన్‌టిఎ ప్రధాన కార్యాలయం ఉంది. నిరసనకు సంకేతంగా కార్యాలయం తలుపులకు తాళం వేశారు. ఎన్‌ఎస్‌యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి నేతృత్వంలో ఈ నిరసన సాగింది. ఎన్‌టిఎను మూసివేయాలని నినాదాలు చేశారు. పోలీస్‌లు అక్కడకు వెళ్లి పరిస్థితిని అదుపు లోకి తీసుకురాడానికి ప్రయత్నించారు.
విద్యార్థులు నిరసన తెలుపుతుండగా ఎన్‌టిఎ కార్యాలయం లోపలి నుంచి తలుపులను సంబంధిత అధికారులు మూసివేశారు. ఎన్‌టిఎ అసమర్థత, నిర్లక్షం కారణంగా దేశంలోని మొత్తం విద్యార్థులు అనేక దురవస్థకు గురవుతున్నారని, తరచుగా పరీక్షలు వాయిదా వేయడం, పేపర్ లీకులు ఇవన్నీ నిర్వహణలోని వైఫల్యాలని చౌదరి ధ్వజమెత్తారు. ఇవన్నీ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యక్ష దాడిగా చౌదరి వ్యాఖ్యానించారు. ఈ కారణాల దృష్టా ఎన్‌టిఎను నిషేధించాలని, దానికి బదులుగా అత్యంత విశ్వసనీయమైన పారదర్శకమైన వ్యవస్థను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేర్చకుంటే రేపటి నుంచి దేశం మొత్తం మీద ఉన్న ఎన్‌టిఎ కార్యాలయాలను మూసివేస్తామని హెచ్చరించారు.