యుజిసి నెట్ పరీక్ష రద్దు, నీట్ పీరక్ష నిర్వహణలో అక్రమాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియచేస్తున్న వివిధ వ్యిర్థి సంఘాల సభ్యులు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పాతిక మందికి పైగా విద్యార్థులను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం వెలుపల, ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం వెలుపల నిరసన తెలియచేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎ, డిఎస్‌ఎఫ్, కెవైఎస్, ఎన్‌ఎస్‌యుఐ వంటి విద్యార్థి సంఘాలకు చెందిన సభ్యులతోపాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ నిరసనలలో పాల్గొన్నారు.
పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) పదేపదే విఫలమవుతోందని, ఎన్‌టిఎని పూర్తిగా రద్దు చేయాలని జెఎన్‌యు విభాగమైన ఎఐఎస్‌ఎ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. నిరసనలలో పాల్గొన్న విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని, వారిపై దాడి చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థినులను అవహేళన చేస్తూ వారిపై దౌర్జన్యానికి పోలీసులు పాల్పడ్డారని ఎస్‌ఎఫ్‌ఐ ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. హై సెక్యూరిటీ జోన్లలో సెక్షన్ 144 అమలులో ఉందని, ఇక్కడ నిరసనలకు ముందస్తు తీసుకోవలసి ఉంటుందని వారు చెప్పారు.