Thursday, January 23, 2025

ఎన్‌టిఆర్ స్మారక నాణెం విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విశ్వవిఖ్యాత నటుడు ఎన్‌టి రామారావు (ఎన్‌టిఆర్) సంస్మరణార్థం వంద రూపాయల నాణెన్ని విడుదల చేశారు. సోమవారం రాష్ట్రపతిభవన్ సాంస్కృతిక కేంద్రం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ నాణ్యమైన నాణాన్ని ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. ఉమ్మడి తెలుగురాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించిన ఎన్‌టిఆర్ శతజయంతి సందర్భంగా ఈ స్మారకచిహ్నాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు. తెలుగు సినిమాలలో పలు విశిష్ట పాత్రలతో ఎన్‌టిఆర్ భారతీయ సినిమా, సంస్కృతికి వన్నెలు అద్దారని రాష్ట్రపతి కొనియాడారు. రాముడిగా , శ్రీకృష్ణుడిగా ఆయన తన జీవితకాలపు పాత్రలతో రామాయణ, మహాభారత ఘట్టాలకు సజీవరూపకల్పన చేశారని తెలిపారు. ఆయన చేసిన పాత్రలతో ప్రజల హృదయాలలో చిరకాలం మెదిలారని గుర్తు చేశారు. చివరికి ప్రజలు ఆయనను దేవుడిగా కీర్తించి, పూజించారని ఇది అందరికీ సాధ్యం కాదని తెలిపారు.

కేవలం పౌరాణిక పాత్రలే కాకుండా ఆయన సామాన్యుడు, ఉదాత్త నాయకుడి పాత్రల్లోనూ జీవించారని చెప్పారు. మనుష్యులంతా ఒక్కటే అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించి సర్వసమానత్వాన్ని చాటారని తెలిపారు. ప్రజా జీవితంలోనూ, నేతగా కూడా ఆయన తన ప్రాచుర్యం దక్కించుకున్నారని వివరించారు. కష్టించి పనిచేయడం, అసాధారణ వ్యక్తిత్వం ద్వారా ఆయన దేశ రాజకీయాలలో సరికొత్త విశిష్ట అధ్యాయం సృష్టించారని, ఆయన పేరిట ఈ నాణేం విడుదల కావడం మంచి పరిణామమని తెలిపారు. తన పదవీ హయాంలో ప్రవేశపెట్టిన వినూత్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ఇప్పటికీ ప్రజలలో చిరస్మరణీయుడిగా నిలిచారని కితాబు ఇచ్చారు. ప్రత్యేకించి తెలుగువారి మదిలో ఆయన స్థానం విశిష్టంగా నిలుస్తుందన్నారు. ఈ స్మారక నాణేన్ని తీసుకువచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ చొరవ అభినందనీయం అన్నారు.

నాణెం విడుదల కార్యక్రమానికి బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, ఎన్‌టిఆర్ కుటుంబ సభ్యులు హీరో బాలకృష్ణ, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు , కొందరు ఎంపిలు హాజరయ్యారు. కాగా ఓ వ్యక్తి ముఖచిత్రంతో నాణేం విడుదల కావడం ఇదే తొలిసారి అని హైదరాబాద్ మింట్ చీఫ్ మేనేజర్ విఎస్‌ఆర్ నాయుడు తెలిపారు. హైదరాబాద్ మింట్‌లోనే ఈ నాణేం ముద్రించారు. తొలి విడతలో 12వేల వరకూ ఎన్‌టిఆర్ నాణేలు రూపొందించారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News