Saturday, December 21, 2024

ముంచుకొస్తున్న అణుయుద్ధం!

- Advertisement -
- Advertisement -

ప్రపంచం అణు యుద్ధానికి చేరువలో ఉందా? తాజా పరిణామాలు చూస్తే అదే భయం కలుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడుతుందని, పశ్చిమాసియా కల్లోలం నివారించబడుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో మంగళవారం (నవంబర్ 19) ఒక్క రోజులోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి మంగళవారం నాటికి సరిగ్గా 1000 రోజులు పూర్తి కాగా, రష్యాపై అమాంతంగా అమెరికా దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఎటిఎసిఎంఎస్) బాలిస్టిక్ క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించి దాడులు ముమ్మరం చేయడం విస్మయం కలిగిస్తోంది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వినియోగించడం ఇదే మొదటిసారి. వీటిని వినియోగించుకోడానికి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అనుమతించిన స్వల్ప కాలంలోనే ఉక్రెయిన్ అమెరికా క్షిపణులతో రష్యాపై దాడికి పాల్పడింది.

ఈ క్షిపణులు రష్యాలోని 300 కిమీ దూరం వరకు లక్షాన్ని సాధించగలవు. 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తరువాత ఇంతవరకు అణువివాదం తలెత్తలేదు. మళ్లీ ఇప్పుడు అణువివాదం ముంచుకొస్తోంది.ఈ దాడులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల దాడికి ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతివ్వడమంటే యుద్ధానికి మరింత ఆజ్యం పోయడమేనని ఆయన మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అణ్వస్త్ర వినియోగానికి సిద్ధమవుతున్నారు. పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడికి పాల్పడితే అణ్వాయుధాలు ప్రయోగించడానికి వీలుగా అణుముసాయిదాను సవరించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏదేశమైనా తమపై దాడికి పాల్పడితే దాన్ని ఆ కూటమి దాడిగానే పరిగణిస్తామని పుతిన్ హెచ్చరించారు. రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అణువార్ హెడ్స్ ఉన్న దేశం రష్యాయే. 1994లో సోవియెట్ నుంచి విడిపోయే సమయానికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలు ఉండేవి.

కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నిటినీ ఉక్రెయిన్ నాశనం చేసింది. అందుకనే అమెరికాతో పాటు అణ్వాయుధాలు ఉన్న అనేక దేశాల సాయాన్ని ఉక్రెయిన్ ఆకాంక్షిస్తోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ అండదండలతో రష్యాపై ఏకంగా ఆరు దీర్ఘశ్రేణి క్షిపణుల్ని ప్రయోగించింది. ఇందులో ఐదింటిని రష్యా కూల్చేసినట్టు, మరో క్షిపణిని నాశనం చేసినట్టు రష్యా ప్రకటించింది. ఇదిలా ఉండగా రష్యా సేనల దూకుడును తగ్గించడానికి ఉక్రెయిన్‌కు మరో ప్రమాదకర ఆయుధాన్ని అందించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. తాజాగా యాంటీ పర్సనల్ మైన్స్‌ను ఉక్రెయిన్‌కు ఇవ్వాలని బైడెన్ నిర్ణయించారు. ఇవి ఒక విధంగా మందుపాతరలు అని చెప్పవచ్చు. కీవ్ తమ భూభాగాలను కాపాడుకోవడానికి ఈ యాంటీ పర్సనల్ మైన్స్ బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.

యుద్ధం ముగిసిన తరువాత కూడా వీటిని భూమిలో నుంచి తొలగించకపోతే వేల సంఖ్యలో ప్రజలు చనిపోవడం కానీ, అవయవాలు కోల్పోవడం కానీ జరుగుతుంది. ఇలాంటి ప్రమాదం లేకుండా వాటంతట అవే నిర్వీర్యం అయ్యేలా టైమ్ సెట్ చేసుకొనేలా ఈ మైన్స్‌ను తయారు చేసినట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మందుపాతరల తయారీనే తాము నిలిపివేసినట్టు అమెరికా ప్రకటించినా ఇప్పుడు ఉక్రెయిన్‌కు వాటిని అందివ్వడానికి సిద్ధపడడం చెప్పుకోదగిన విషయం. బైడెన్ ఇలాంటి నిర్ణయాలు అకస్మాత్తుగా తీసుకున్నారన్నది ప్రశ్న. చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ రాకుండా అన్ని మార్గాలు మూసివేయడానికే ఈ ప్రయత్నం అన్న అభిప్రాయం ఒకటి వినిపిస్తోంది. బైడెన్ బాధ్యతల నుంచి వైదొలగక ముందే శాంతి ఒప్పందానికి విఘాతం కలిగించడం మరో అభిప్రాయం.

తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉక్రెయిన్‌కు సాయం నిలిపివేస్తానని, యుద్ధం ఆపివేస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితుల్లో ట్రంప్‌కు తప్పనిసరిగా ఉక్రెయిన్ పక్షాన నిలబడవలసిన పరిస్థితి ఏర్పడేలా బైడెన్ వ్యూహం రూపొందించినట్టు తెలుస్తోంది. అమెరికా తయారీ క్షిపణులను రష్యాపై దాడికి ఉక్రెయిన్ పంపించడంతో రష్యాకు సాయంగా ఉన్న ఉత్తర కొరియా రష్యాకు మరిన్ని ఆయుధాలను పంపించింది. తాజాగా 170 గన్‌లు, 240 రాకెట్లను రష్యాకు ఉత్తర కొరియా తరలించింది. అయితే ఈ ఆయుధాలను వినియోగించే సామర్థం రష్యాకు లేకపోవడంతో వారికి శిక్షణ ఇచ్చేందుకు ఉత్తర కొరియా నుంచి సిబ్బంది అక్కడికి వెళ్లింది.

తాజా పరిణామాలతో మూడో ప్రపంచ యుద్ధం సంభవించే ప్రమాదం పొంచి ఉందని యూరప్ దేశాలు భయపడుతున్నాయి. అలాంటి పరిస్థితి తలెత్తితే ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ తదితర దేశాలు తమ ప్రజలను హెచ్చరించాయి. స్వీడన్ ఇంటింటికీ హెచ్చరికలతో కూడిన 52 లక్షల కరపత్రాలను పంచడం ప్రారంభించింది. ఎవరైనా దాడికి పాల్పడితే దేశ పరిరక్షణకు మనమంతా సమష్టిగా, ధైర్యంగా పోరాడుదాం అన్న నినాదంతో ప్రజలకు పిలుపునిచ్చింది. ఆహారం, మంచి నీళ్లు, ఇతర అవసరాలు నిల్వచేసుకుని ఉంచుకోవాలని ప్రజలను అప్రమత్తం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News