గురుగ్రామ్: హర్యానాలోని నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడానికి కారణమైన కీలక నిందితుల్లో ఒకరిని పోలీస్‌లు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితులు ఆరావళిలో ఉన్నారన్న సమాచారం తెలుసుకన్న పోలీస్‌లు అక్కడికి చేరుకున్నారు. దిధరా గ్రామానికి చెందిన ఆమిర్ అనే నిందితుడు పోలీస్‌ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీస్‌లు ఎదురు కాల్పులు జరిపి అతడిని అదుపు లోకి తీసుకున్నారు.
ఈ సంఘటనలో అతడి కాలిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆమిర్‌పై లూటీలు, హత్యలకు సంబంధించి 100 కేసులు నమోదయ్యాయి. దీంతో అతడిపై రూ. 25 వేల రివార్డును కూడా ప్రకటించారు. స్థానికంగా ఓ మతపరమైన ఊరేగింపుపై కొంతమంది రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘర్షణలు గురుగ్రామ్ వరకు వ్యాపించాయి. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో ఆరుగురు మృతి చెందారు. పోలీస్‌లు 280 మంది నిందితులను అరెస్ట్ చేశారు.