ఇస్లామాబాద్ : అధికారాన్ని దొంగలకు అప్పగించడం కన్నా పాకిస్థాన్ మీద అణుబాంబు వేయడం ఉత్తమమని పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ (పిటిఐ ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆయన తన బనిగల నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పాక్ మీడియా శనివారం వెల్లడించింది. దొంగలను దేశం మీద రుద్దుతుండటం చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఉమ్రాన్ ఖాన్ చెప్పారు. వీరికి అధికారాన్ని అప్పగించడం కన్నా అణుబాంబును వేయడం ఉత్తమమని ఆయన వ్యాఖ్యానించారు. గత పాలకుల అవినీతి కథలను తనకు చెప్పే శక్తివంతులైన వారు ఇప్పుడు తనకు సలహాలు ఇస్తున్నారన్నారు. ఇతరులపై వచ్చే అవినీతి ఆరోపణలపై దృష్టి పెట్టడానికి బదులు తనప్రభుత్వ పనితీరుపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారని చెప్పారు. మే 20 న లాంగ్ మార్చ్ ద్వారా రాజధాని నగరం ఇస్లామాబాద్ లోకి ప్రవేశించకుండా తమను ఏశక్తి ఆపలేదన్నారు.