Thursday, January 23, 2025

ఇది నిజమైన మార్పేనా?

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession కరకు హిందుత్వకు కూడా పట్టువిడుపులుంటాయని, తన నెత్తి మీదికి వస్తే ఎత్తిన కత్తిని దించుతుందని స్పష్టమైపోయింది. ఇస్లాం మతం పైన, మహమ్మద్ ప్రవక్తపైన బిజెపి ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై అరబ్ దేశాలు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ఊహించని విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకొన్నది. వ్యాఖ్యాత లిద్దరిలో ఒకరిని సస్పెండ్ చేసింది, మరొకరిని పార్టీ నుంచి తొలగించింది, అంటే మొదటిసారిగా బిజెపి కేవలం వొక రాజకీయ పార్టీగా ఉండడానికి, పాలక పక్షంగా వ్యవహరించడానికి మధ్య తేడాను గమనించిందని రూఢి అయింది. ప్రపంచమంతటా వ్యాపించి వున్న ముస్లింలకు కోపం తెప్పించే చర్యలకు పాల్పడితే దేశ పాలకులుగా యెంతటి యిరకాటాన్ని యెదుర్కోవలసి వస్తుందో తొలిసారి తెలుసుకొన్నది.

బిజెపి ప్రతినిధులిద్దరి కువ్యాఖ్యలను అయిదు అరబ్ దేశాలు తీవ్ర స్వరంతో ఖండించాయి. పాకిస్థాన్, అఫ్ఘాన్‌లు గొంతు కలిపాయి. సామాజిక మాధ్యమాల్లో నిరసనలు మిన్నంటాయి. ఇండియా వస్తువులను బహిష్కరించాలన్న పిలుపులు కూడా వినవచ్చాయి. ఇస్లాం మత విశ్వాసులను మానసికంగా తీవ్రంగా గాయపరచిన ఆ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే ప్రధాని మోడీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని వుంటే వేరుగా వుండేది. కాని ఖతార్, కువైట్‌లు అక్కడి మన రాయబారులను పిలిపించుకొని హెచ్చరించినంత వరకు ఊరుకొని ఆ తర్వాతనే చర్యలు తీసుకొన్నది. అంతే కాదు, వారితో ప్రభుత్వానికి సంబంధం లేదని, వారు చిల్లరమల్లర శక్తులని చెప్పుకొన్నది. నిజానికి నూపుర్ శర్మ గాని, నవీన్ జిందాల్ గాని ఇలా జరుగుతుందని వూహించి వుండరు. తమ పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చినప్పటి నుంచి ముస్లింలు, దళితులపై ఎంత క్రూరమైన, నీచమైన దాడులు జరిపినా ప్రధాని మోడీ తదితర పెద్దలు పట్టించుకోలేదని, చూసీ చూడనట్టు వదిలేశారని వారికి తెలుసు. తమ వ్యాఖ్యలను సైతం వారు తీవ్రమైనవిగా భావించరని అనుకొన్నారు.

అరబ్ దేశాలతో మనకున్న సంబంధాల రీత్యా మోడీ ప్రభుత్వం మొదటి సారి బెంబేలెత్తింది. అరబ్ (గల్ఫ్) దేశాలతో ఇండియా సంబంధాలు గాఢమైనవి, లక్షలాది మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. కీలకావసరమైన చమురు కోసం వాటిపై ఆధారపడి ఉన్నాము. యుఎఇ, సౌదీ, కువైట్, ఒమన్, కతార్, బహ్రెయిన్, జోర్డాన్, ఇరాక్, లెబనాన్లలో 89 లక్షల భారతీయులున్నారు. ఒక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనే అక్కడి జనాభాలో మూడో వంతుకు పైగా ఇండియన్‌లున్నారు. ఈ దేశాల్లో పెద్ద పెద్ద దుకాణాలు, రెస్టారెంట్‌లను భారతీయులు నడుపుతున్నారు. బిజెపి ఇస్లాం వ్యతిరేకోన్మాదం పెరిగితే గల్ఫ్ దేశాల్లో నిరసన ఈ వాణిజ్య కేంద్రాల అంతు చూస్తుంది. స్వదేశంలో ముస్లింలను గో రక్షక దళాలు నానా ఇబ్బందుల పాలు చేస్తున్న దశలోనే ప్రధాని మోడీ ఈ దేశాల్లో పర్యటించి అక్కడి పాలకులతో చెట్టపట్టాలేసుకొన్నారు.

అప్పుడు లేని వ్యతిరేకత అక్కడి నుంచి ఇప్పుడే ఇంతగా దూసుకురాడానికి నేరుగా ప్రవక్తను తక్కువ చేసి వ్యాఖ్యానించడమే కారణమా? లేక ఇటీవల వరసగా ముస్లింలను ఇబ్బందుల పాలు చేస్తూ జరిగిన హిజాబ్, బుల్డోజర్ వంటి ఘటనలు కూడా అరబ్ దేశాధినేతలను కలచివేశాయా? భారత ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని కతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది. బాధ్యులను శిక్షించకపోతే ఇండియా మరింత తీవ్రమైన విద్వేషాన్ని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవలసి వస్తుందని కువైట్ హెచ్చరించింది. ఇంత కాలానికి ప్రధాని మోడీ ప్రభుత్వం తాము గాజు భవనంలో ఉంటూ ఇతరులపై రాళ్లు రువ్వుతున్నామన్న సంగతిని గ్రహించింది. అయితే ఇది ఈ వొక్క సందర్భానికే పరిమితమైనదేనా, ఇకముందు ఓటు బ్యాంకు కోసం ముస్లిం వ్యతిరేకతను ఉసిగొల్పడం మానుకుంటారా అనేది అతి పెద్ద ప్రశ్న. మొత్తంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల పునాదే ముస్లిం వ్యతిరేకత.

గత కాలపు నవాబుల చర్యలకు ప్రతీకారం పేరుతో దేశాన్ని హిందూ మతతత్వ దేశంగా మార్చాలనే సిద్ధాంతానికి వారు స్వస్తి చెబుతారా, తీవ్రత తగ్గిస్తారా? వేచి చూడాలి. సౌదీ అరేబియా, ఇరాన్‌లు కూడా భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురును మనకు అనుగుణమైన ఏర్పాటుపై కొనుగోలు చేసుకొన్న రోజులన్నాయి. ఇప్పటికీ కువైట్, యుఎఇ, సౌదీ అరేబియాల నుంచి మన అవసరాల్లో సగం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకొంటున్నాము. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన తొమ్మిది రోజుల విదేశీ పర్యటన చివరి రోజున ఖతార్‌లో మాట్లాడుతూ అందరినీ కలుపుకొనిపోయే సమ్మిళిత తత్త్వమే భారత రాజ్యాంగ లక్షణమని ప్రకటించి, ఆ మేరకు అరబ్ దేశాలకు హామీ ఇచ్చారు. వాస్తవానికి భారత రాజ్యాంగ లక్షణం సర్వమత సమదూరం, అందరినీ కలుపుకొనిపోడమే. కాని, బిజెపి పాలకులే ఇంతకాలం రాజ్యాంగా న్ని ఒక విధంగా నిర్లక్షం చేశారు. ఉపరాష్ట్రపతి ఖతార్‌లో ప్రకటించిన విధంగా ఇకనుంచైనా సమ్మిళిత రాజ్యాంగ ధర్మాన్ని పాటిస్తారని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News