Monday, December 23, 2024

మిరప, కూరగాయల నారు విక్రయాల్లో నర్సరీ దారులు నాణ్యత పాటించాలి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : మిరప, కూరగాయల నారు విక్రయాల్లో నర్సరీ దారులు నాణ్యత పాటించాలని తద్వారా మంచి దిగుబడి వస్తుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం ఐడివోసి కార్యాలయంలో ఉద్యాన, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మిరప, కూరగాయల నారు పెంచే నర్సరీ దారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం లైసెన్సు దారులు మాత్రమే నర్సరీలు నిర్వహించాలని, లైసెన్సులు లేకుండా నర్సరీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 33 నర్సరీలు నిర్వహిస్తున్నారని రైతులు లైసెన్సు పొందిన నర్సరీ దారుల నుంచి మాత్రమే నారు కొనుగోలు చేయాలని చెప్పారు.

అమ్మకాలు, కొనుగోళ్లు పకడ్భందీగా లెక్క ప్రకారం జరగాలని సూచించారు. కొనుగోలు దారులకు తప్పక రశీదు ఇవ్వాలని, స్టాకు వివరాలు ప్రదర్శింప చేయాలని తెలిపారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని సూచిస్తూ అక్రమాలకు పాల్పడొద్దని హెచ్చరించారు. నర్సరీలలో మేలైన యాజమాన్య పద్దతులు, సూచనలు, నర్సరీల నిర్వహణ నియమ నిబంధనలు పాటించాలని చెప్పారు. వ్యవసాయ శాఖ ద్వారా ఆమోదం పొందిన పలు రకాల నారును పెంచాలని చెప్పారు. ఆరుబయట పెంచే నారును కొనుగోలు చెయొద్దని, ఆ విధంగా నారు పెంచడానికి అనుమతులు లేవని ఆయన పేర్కొన్నారు. టాస్క్ ఫోర్సు సిబ్బంది తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. నర్సరీ నియమ నిబంధనలు పాటించని వారిపై నకిలీ విత్తనాలు, నారు విక్రయించే వారిపై పిడి యాక్టు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

నిబంధనలు పాటించకపోతే జైలు శిక్ష తప్పదని, చట్ట ప్రకారం 50 వేలు జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధిస్తామని చెప్పారు. నకిలీ నారు, విత్తనాలు అమ్మడం, గడువు తీరనవి అమ్మడం, లైసెన్సు లేకుండా విక్రయాలు చేయడం, హెచ్‌టి విత్తనాలు అమ్మడం, ఒకరి లైసెన్సు మీద ఇంకొకరు, ప్రాంతాలు మార్చి పేరు మార్పుతో విక్రయాలు చేయడం నిషేదమని చెప్పారు. లైసెన్సులు ప్రదర్శించకపోవడం, బిల్లు ఇవ్వకపోవడం, స్టాకు రిజిష్టరు నిర్వహించకపోవడం సవరించే అవకాశం ఉన్న పొరపాట్లని చెప్పడం, అటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. రైతులకు ఆరోగ్యవంతమైన, నాణ్యమైన నారును అందించడం వల్ల అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. నారు ధృడంగా ఉంటేనే మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుందని అన్నారు.

ఉద్యానవన పంటలకు మన జిల్లా ప్రసిద్ధి అని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. నకిలీ విత్తనాలు, నారు విక్రయించే వ్యక్తుల సమాచారం అందజేయాలని,వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. తదుపరి ఉత్తమ రైతు, నర్సరీ నిర్వహణదారుడు పాపారావుకు శాలువా కప్పి అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉద్యాన అధికారి జినుగు మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఏడిఏ లాల్‌చంద్, కేవికే శాస్త్రవేత్తలు నారాయణమ్మ, శివ,నర్సరీ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News