Tuesday, November 5, 2024

ప్రజారోగ్యంలో వీర వనితలు

- Advertisement -
- Advertisement -

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నర్సులు సేవలు. ఆస్పత్రిలో రోగి కోలుకోవాలంటే వైద్యులు చేసే ప్రయత్నంతో పాటు వారి పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. వీరు క్షేత్ర స్థాయిలో ఉన్న రోగులకు, వైద్యులకు మధ్య సంధాన కర్తగా పని చేస్తారు. అనారోగ్యంతో ఆసుపత్రి గడప తొక్కిన రోగికి వైద్య సేవలు అందించే నర్సులు చూపించే ప్రేమ, ఆప్యాయత రోగిని సాంత్వన కలిగిస్తాయి. ఏ భేదం లేకుండా ప్రేమించే గుణం ఈ భూమిపై తల్లికి మాత్రమే ఉంటుందని అటు తర్వాత వైద్య వృత్తిలో నర్సులకు మాత్రమే సాధ్యం. కావున వైద్య రంగంలో నర్సులు సమాంతర వైద్యులుగా పేర్కొనడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సాధారణంగా మహిళలే నర్సులుగా పని చేయడం జరుగుతుంది. వారు సహనం, ఓర్పుతో వ్యవహరిస్తూ రోగుల పట్ల సానుభూతి చూపిస్తారు. మొట్టమొదట 1974వ సంవత్సరం నుండి ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు నాంది పలికిన మహిళ ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ ఆమె స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా నర్సింగ్ వ్యవస్థ కొనసాగుతున్నది.

ఆమె పుట్టిన రోజైన మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ప్రతి ఏట నిర్వహిస్తారు. వైద్య రంగంలో కీలకమైన నర్సుల వృత్తి గౌరవాన్ని, హుందాతనాన్ని తెలియజేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ రోజున గుర్తు చేసుకుంటారు. భారత దేశంలో మొట్టమొదటి సారిగా పోర్చుగీసువారు నర్సుల వ్యవస్థకు నాంది పలికారు. ప్రపంచ మహిళా ఉద్యోగినులలో 41 శాతం నర్సింగ్ రంగంలోనే ఉన్నారు. మన దేశంలో నర్సులు సంఖ్యలో కేరళ, మేఘాలయ ప్రథమ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. కేరళ యువతుల్లో అత్యధికంగా నర్సు వృత్తిలోకి ప్రవేశించి విదేశాల్లో పని చేస్తున్నారు.

స్వాతంత్య్రానికి పూర్వం మన దేశంలో మంత్రసానుల వ్యవస్థ ప్రాచుర్యంలో ఉండేది. ఆరోగ్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో తల్లీబిడ్డల యోగక్షేమాలు మంత్రసానులు చూసేవారు. నేటికీ అక్కడక్కడ మారుమూల ఆదివాసీ, గ్రామీణ సమూహాలలో పురుడు పోయడం, బాలింతల ఆరోగ్య సంరక్షణలో మంత్రసానుల పాత్ర ఉన్నది. వారే ఎఎన్‌ఎం (Auxiliary nurse mid wifery) లేదా ఆరోగ్య కార్యకర్తగా పిలవబడుతూ గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సేవల సహాయకురాలిగా పని చేయడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో తలి, బిడ్డ ఆరోగ్యంలో పురోగతి సాధించడానికి ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. గర్భిణీలు, బాలింతలు నవజాత శిశువు సంరక్షణ లాంటి ప్రజారోగ్య సంబంధిత అంశాలలో వారి సేవలు వెలకట్టలేనివి.

మిడ్ వైఫరీ సేవలపై ప్రముఖ మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ పత్రిక గతంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం సమర్థవంతమైన మిడ్ వైఫరీ సేవల ద్వారా దేశంలో 83% మాత, నవజాత శిశు మరణాలను నివారించవచ్చని, 24% ముందస్తు జనాలను తగ్గించామని పేర్కొన్నది. అనగా మాతా శిశు సంరక్షణలో వారి సేవలు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నవని చెప్పవచ్చు. క్షేత్ర స్థాయిలో ఆరోగ్య కార్యకర్త సేవలు కీలకమైనవి. గ్రామాల్లోని మాతాశిశు ఆరోగ్యం, టీకా కార్యక్రమాల అమలు, కాలానుగుణ అంటువ్యాధులపై అవగాహన, మందుల పంపిణీ, పారిశుద్ధ్యంపై అవగాహన, కుటుంబ నియంత్రణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో పాటు ఇతర ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుంది. అదే విధంగా గ్రామాల్లోని ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాలు తదితర అనేక విభాగాల సమన్వయంతో గ్రామ ఆరోగ్యాభివృద్ధికి తన వంతు పాత్ర పోషించడం జరుగుతోంది.

అందరికీ ఆరోగ్యం అనే ప్రభుత్వ లక్ష్య సాధనలో నర్సులు కీలక భూమిక పోషించడం జరుగుతోంది. పేద మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారింది. అందువల్ల అనేక మంది మధ్య తరగతి కుటుంబాలు నర్సింగ్ వృత్తిని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో బడుగు వర్గాల ఉపాధి మార్గంగా ఈ వృత్తిపై ముద్ర వేయడం బాధాకరం. ప్రస్తుతం నర్సింగ్ వృత్తిలో ఉన్న వాళ్లకు పని ప్రదేశాల్లో వేధింపులు, అరకొర వేతనాలు, జీతాల చెల్లింపులో జాప్యం, ఎక్కువ పని గంటలు వృత్తిపరమైన ఎదుగుదల లేకపోవడం, రాత్రి వేళ ల్లో విధులు నిర్వహించడం లాంటి సమస్యలు నర్సుల సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

ప్రస్తుతం భారత్‌లో నర్సులకు ఉపాధి అవకాశాలు తక్కువ ఉండటం, తగిన ప్రోత్సాహం కొరవడడం వలన మెరుగైన జీతభత్యాలు కొరకు విదేశాలకు వెళ్తున్నారు. అదే విధంగా క్షేత్ర పర్యటనలో దాడులు, అదనపు బాధ్యతలు, ఆరోగ్య సేవలందిస్తున్నపుడు కనీస వైద్య పరికరాలు కొరత, ఉద్యోగ ఆభద్రత వంటివి వీరి పని నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నర్సింగ్ వృత్తిని చేపట్టే వారు భవిష్యత్తులో క్రమేణా తగ్గుముఖం పడతారనేది వాస్తవం. ఈ పరిస్థితి ప్రాథమిక ప్రజారోగ్య రంగం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం ప్రభుత్వం వైద్య రంగంలో నర్సులను, గ్రామ స్థాయి లో ఆరోగ్యం కార్యకర్తల నియామకం చేపట్టాలి.

అప్పుడే ప్రజారోగ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. వారి రక్షణ చర్యలు, ఉద్యోగ భద్రత, ఆరోగ్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నర్సు, ఆరోగ్య కార్యకర్తల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ నవతరం ఈ వృత్తిని ఎంచుకొనే విధంగా ప్రోత్సహించాలి. నర్సులకు సరైన శిక్షణ, గౌరవం, హోదా, వేతనాలు అందజేయాలి. ప్రభుత్వ జాతీయ ఆరోగ్య విధాన రూపకల్పనలో వారి సేవలను పరిగణనలోకి తీసుకోవాలి.రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. నేడు కరోనా నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు వైద్యరంగానికి మూలస్తంభాలుగా పని చేసిన వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రాథమిక ప్రజారోగ్య జగత్తులోని వీర వనితలుగా పని చేస్తున్న వీరికి ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ నైతిక మద్దతునిచ్చి గౌరవించాలి.

ఎస్. శ్యామల
8008539905

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News