Friday, November 22, 2024

రోగుల ఆత్మీయ మిత్రులు నర్సులే!

- Advertisement -
- Advertisement -

ఆసుపత్రి కరోనా వార్డులో అవిశ్రాంతంగా సేవలు నిర్వహించిన నర్సులు రోగుల చికిత్సలో తమ ప్రాణాలను అడ్డుపెట్టడం, అదే కరోనా విష కోరలకు చిక్కి పలువురు నర్సులు తనువు చాలించడం మనందరి హృదయాలను కలిచి వేశాయి. వందల వేల రోగులకు ఊరట చేకూర్చే చిరునవ్వుల పలుకులు, కంటికి రెప్పలా కాపాడే ఆదర్శ సేవాతత్పరులు, అందరి బాధల్ని తన బాధలుగా భావించే ఆదర్శ అతివలు, రోగి చిరునవ్వును తలిచే వైద్య సైనికులు, ఆదరణలో శిఖరాగ్ర సమానులైన కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్. తమ ప్రాణాలను కరోనా నోట్లో పెట్టి కూడా విధి నిర్వహణలు చేసిన శ్వేత వర్ణ నైటింగేల్ నర్సులు మహా ప్రళయ కష్టకాలంలో మానవాళికి ఆరోగ్య శ్వాసను అందించే వృత్తిలో నిమగ్నమై ఉన్నారు. అలుపెరుగని పోరాటం చేస్తూ, రోగులలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, ప్రాణాలను కాపాడుటలో అహర్నిశలు శ్రమిస్తున్న నర్సులు మనందరికీ మానవ రూపంలో ఉన్న దేవతలుగా కనిపిస్తున్నారు.
నర్సుల అమృత హస్త స్పర్శ
వైద్య ఆరోగ్యశాఖలో గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రుల వరకు నర్సులు లేకుండా వైద్యం జరుగదు. వైద్యులే ప్రధానం అయినప్పటికీ నర్సులు రోగులతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి, కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి, వైద్య, వ్యక్తిగత సేవలను అందిస్తూ, మన ఇంటి ‘సిస్టర్స్’గా అద్వితీయ సేవలను అందిస్తున్నారు. కరోనా మహమ్మారి కమ్మిన విష మబ్బులను పారద్రోలే సైనికుల్లా నర్సులు ప్రజల మనస్సుల్ని చూరగొనడం చూశాం. వైద్యులు రోగ నిర్ధారణ, మందుల సిఫార్సు, ఆపరేషన్లు లాంటి ముఖ్య సేవలు అందించినా, నర్సుల నిరంతర ప్రమేయం లేకుండా వైద్యం పూర్తి కాదు. అన్ని ఉద్యోగాల్లోకి నర్సింగ్ వృత్తి అతి పవిత్రమైందని, విలువలతో కూడినదని అందరూ అంగీకరించాల్సిందే.
ఏ లేడీ విత్ ది ల్యాంప్
వైద్యరంగంలో నర్సుల పాత్రను గుర్తించిన అంతర్జాతీయ సమాజం ప్రతి ఏటా ఫ్లోరెన్స్ నైటింగేల్ (12 మే 1820-13 ఆగస్టు 1910) జన్మదినం సందర్భంగా 12 మే రోజున ‘అంతర్జాతీయ నర్సుల దినం’ ఘనంగా నిర్వహించుట జరుగుతున్నది. ఆధునిక నర్సింగ్‌కు పునాదులు వేసిన ‘ఏ లేడీ విత్ ది ల్యాంప్’గా పిలువబడే ఫ్లోరెన్స్ నైటింగేల్ 1850లో యుద్ధ క్షతగాత్రుల చికిత్సలో చేతుల పరిశుభ్రత, ఇతర నర్సింగ్ జాగ్రత్తలు తీసుకుంటూ మరణాలను 42 శాతం నుంచి 2శాతం వరకు తగ్గించగలిగారు. నైటింగేల్ శతాబ్ది జన్మదినోత్సవాల సందర్భంగా 12 మే 1954 తో ప్రారంభమైన ఈ నర్సుల దినోత్సవం, 1965 నుంచి అంతర్జాతీయంగా నిర్వహించుట ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది అంతర్జాతీయ నర్సుల దినం- 2022 నినాదంగా ‘నర్సెస్ : ఏ వాయిస్ టు లీడ్ – ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్‌కేర్’ అనే సముచితమైన అంశాన్ని తీసుకొని ప్రపంచ దేశాలన్నీ ఘనంగా నిర్వహించడం ముదావహం.
అమూల్య సేవలు
‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్’ నేతృత్వంలో నిర్వహించబడే అంతర్జాతీయ నర్సుల వారోత్సవాల (09 మే నుంచి 15 వరకు) వేదికగా నర్సుల సేవలను కొనియాడడం, కృతజ్ఞతలు తెలపడం, బహుమతులు /పుష్పగుచ్ఛాలు / గ్రీటింగ్ కార్డులు అందించడం, శుభాకాంక్షలను తెలుపడం వంటి కార్యక్రమాలను చేయటానికి ప్రయత్నించాలి. తల్లి ప్రసవ వేదనను తన నొప్పిగా భావించి శిశు జననానికి చేయూతనిచ్చి, శిశువు ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణతో ప్రారంభమై మనిషి తుది శ్వాస వరకు ప్రతి అనారోగ్య సమయంలో ఆదుకునే నర్సులు ప్రతి వ్యక్తి జీవితంలో ప్రధాన భాగమై ఉంటారు. వైద్యరంగానికి వెన్నెముకగా నర్సులు 59 శాతం వైద్య సేవలను అందిస్తున్నారు. ఐరాస, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించే నర్సుల దినం సందర్భంగా ఆధునిక నర్సుల సేవలు, శిక్షణలో శాస్త్రీయ మార్పులు లాంటి అంశాలపై దృష్టి సారిస్తారు. కరోనా విజృంభణతో నర్సింగ్ వృత్తి కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నది.
కొవిడ్- 19 కోరల్లో చిక్కిన ప్రపంచ మానవాళికి నర్సులు అపురూప ప్రాణదాతలుగా కనిపిస్తున్నారు. పిపిఇ కిట్లు ధరించడం, కుటుంబాలకు దూరంగా పలు రోజులు ఉంటూ రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించడం లాంటి ప్రాణాపాయ విధులను ధైర్యంగా నిర్వహించిన నర్సులు సదా ప్రశంనీయులే. రోగుల వేదనలు, రోదనలకు ఔషధాలుగా నర్సుల ప్రశాంత పలుకులు, అభయ హస్త స్పర్శలు పని చేస్తాయనేది వాస్తవం. ఫ్లోరెన్స్ నైటింగేల్ ద్వి శతాబ్ది జయంతోత్సవాల సందర్భంగా 2021ని ‘అంతర్జాతీయ నర్సులు, మంత్రసానుల సంవత్సరం’గా కూడా పాటించుట జరిగింది.
నర్సుల తీవ్ర కొరత
ఐరాస అంచనా ప్రకారం 2030 నాటికి 18 మిలియన్ల సుశిక్షితులైన నర్సుల కొరత ఏర్పడుతుందని తేలింది. సమాజ ఆరోగ్య, జీవన ప్రమాణాలను మెరుగు పరిచే నర్సింగ్ వృత్తి భారతదేశంలో 1664లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రారంభమైంది. నర్సింగ్ వృత్తి మహిళలకే వర్తిస్తుందని, పురుషులకు సరికాదనే అంధ విశ్వాసం భారత సమాజంలో నెలకొని ఉంది. భారత్‌లో ప్రతి వెయ్యి మంది జనాభాకు 1.7 నర్సులు (ఒక డాక్టర్‌కు 1,511 జనాభా) మాత్రమే ఉన్నారు. ప్రతి వెయ్యి జనాభాకు ముగ్గురు నర్సులు, ఒక డాక్టర్ ఉండాలని ఐరాస సూచిస్తున్నది. మన దేశంలో 3.07 మిలియన్ల రిజిస్టర్డ్ నర్సులు, 1.1 మిలియన్ల ఫార్మసిస్టులు, 1.2 మిలియన్ అల్లోపతిక్ డాక్టర్లు ఉన్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. ఐరాస వివరాల ప్రకారం ఇండియాలో నర్సుల కొరత అత్యధికంగా ఉందని, మన దేశం నుంచి అనేక మంది నర్సులు అమెరికా, ఇంగ్లాండ్, మిడిల్ ఈస్ట్ దేశాలను వలసలు వెళ్ళుతున్నారని తేలింది.
భారతీయ నర్సులకు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. కరోనా అలల చేదు అనుభవంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా 50 వేల మంది డాక్టర్లతో పాటు పెద్ద సంఖ్యలో నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది సేవలను యుద్ధ ప్రాతిపదికన తీసుకోవడానికి నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామంగా పేర్కొనవచ్చు. మానవాళి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అవిశ్రాంత వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్య సిబ్బంది, ముఖ్యంగా నర్సులను ‘హెల్త్ వారియర్స్’గా గుర్తించి, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలపడం మన కనీస బాధ్యత.

Nurses Great Service during Corona Pandemic

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News