చైనా లోని చెంగ్డే నగరం లోని లాంగ్‌హువా కౌంటీలో ఓ నర్సింగ్‌హోమ్‌లో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 20 మంది వృద్దులు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రాత్రి 11గంటలకు మంటలను ఆర్పగలిగారు. 300 పడకలు గల ఈ గుయోన్ సీనియర్ హోమ్‌లో ప్రమాదం జరిగినప్పుడు 260 మంది వృద్ధులు ఉన్నారని అధికారిక వివరాలు తెలియజేస్తున్నాయి. వీరిలో 98 మంది పూర్తిగా వికలాంగులు కాగా, 84 మంది పాక్షిక వికలాంగులు,మిగతా 78 మంది తమంతట తాము ఆరోగ్యభద్రతను చూసుకోగలుగుతారని తెలుస్తోంది.
ఇక్కడ వృద్ధులకు, వికలాంగులకు వసతి, ఆహారం, ఇతర సేవలు అందిస్తుంటారు. ప్రాథమిక దర్యాప్తులో కోల్డోస్టోరేజి సౌకర్యాన్ని భవనం దిగువన అక్రమంగా నిర్మించడమే ప్రమాదానికి దారి తీసిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం వల్ల 43.52 మిలియన్ యుయాన్ (5.9 మిలియన్ డాలర్లు) వరకు నష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. 2024 జనవరిలో జిన్యు సిటీలో భవన సముదాయంలో అగ్నిప్రమాదం సంభవించి 39 మంది మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి గత అక్టోబర్‌లో 50 మంది అధికారులకు శిక్షపడింది.