Sunday, December 22, 2024

హైకోర్టుల్లో ప్రాంతీయ భాష వాడకానికి ఇబ్బందులు

- Advertisement -
- Advertisement -

NV Ramana comments on local language in High Courts

హైకోర్టుల్లో ప్రాంతీయ భాష వాడకానికి ఇబ్బందులు
సాంకేతికతతో అవి త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నా
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ

చెన్నై: దేశంలోని ఆయా హైకోర్టుల్లో స్థానిక భాషను ఉపయోగించే విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ అన్నారు. అయితే కృత్రిమ మేధో సంపత్తి లాంటి శాస్రీయ ఆవిష్కరణలతో ఈ సమస్య సమీప భవిష్యత్తులోనే పరిష్కారమవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ మద్రాస్ హైకోర్టుకు చెందిన తొమ్మిది అంతస్తుల పరిపాలనా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం జస్టిస్ ఎన్‌వి రమణ మాట్లాడారు. సాంస్కృతిక, భాషాపరమైన హక్కులను పరిరక్షింపకోవడంలో తమిళులు ఎప్పుడూ దేశంలోనే ముందు వరసలో ఉంటున్నారని 1960 దశకంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనను పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నారు.

‘రాజ్యాంగంలోని 348 అధికరణం కింద కల్పించినట్లుగా హైకోర్టుల్లో జరిగే విచారణల్లో స్థానిక భాషను ఉపయోగించడానికి అనుమతించాలని వివిధ ప్రాంతాలనుంచి పదేపదే డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి బోలెడంత చర్చ కూడా జరిగింది. హైకోర్టు కార్యకలాపాల్లో స్థానిక భాషను ఉపయోగించడానికి కొన్ని ఇబ్బందులున్నాయి.శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు, కృత్రిమ మేధో సంపత్తి(ఎఐ) లాంటి వాటి ద్వారా దీనికి సంబంధించిన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని ఆయన అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మద్రాసు హైకోర్టు విచారణల్లో తమిళ భాషను ఉపయోగించడానికి అనుమతించాలని కోరిన నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

NV Ramana comments on local language in High Courts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News