సిజెఐ ఆవేదన, మీడియాపై ఆగ్రహం
న్యూఢిల్లీ : న్యాయమూర్తుల ఎంపిక నియామక ప్రక్రియ విశిష్టం, కీలకమైనదని, ఆషామాషీ వ్యవహారం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ తెలిపారు. అయితే జడ్జిల నియామక ప్రక్రియలో ఏదో జరుగుతున్నట్లు పత్రికలలో ఊహాగానాలు దురదృష్టకరమని చెప్పారు. కొలీజియం భేటీల గురించి ఇతరత్రా మీడియాలో వార్తలు కట్టుకథలుగా ఉండటంపై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ ధోరణి తనను బాగా కలిచివేసిందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9 మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసినట్లు పత్రికలలో వార్తలు వెలువడటంపై జస్టిస్ నవీన్ సిన్హాకు వీడ్కోలు పలికే ధర్మాసననానికి సారథ్యం వహిస్తూ సిజెఐ మాట్లాడారు.
బుధవారం మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించారు. తమ నిర్ణయాలకు ముందే వెలువడ్డ నిర్థారణలుగా ఉన్నాయని, ఇటువంటివి ప్రతికూల ఫలితాలకు దారితీస్తాయని చెప్పారు. యువ ప్రతిభకు ఇటువంటి ఇంతక ముందటి వార్తలు ఇబ్బంది కల్గించిన విషయాన్ని ప్రస్తావించారు. యువకేరీర్లు దెబ్బతింటాయని చెప్పారు. న్యాయవ్యవస్థతో అనుసంధానం అయి ఉండే ప్రతి ఒక్కరూ వ్యవస్థ సమ గ్రత గౌరవమర్యాదల పరిరక్షణకు పాటుపడుతారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ చాలా పవిత్రమైనదనే విషయాన్ని మీడియా మిత్రులు గుర్తించాలని సిజెఐ సూచించారు.