Thursday, January 23, 2025

ఆధునిక వ్యక్తిత్వ వికాస కావ్యం

- Advertisement -
- Advertisement -

చిన్నపని చేయాలంటేనే ఎన్నో అవరోధాలు ఎదురవుతున్న కాలమిది. ప్రతి మంచి పనిలోనూ చెడును వెతికే రంధ్రాన్వేషకులున్న సందర్భం. అందులోనూ ప్రభుత్వ రంగ సంస్థలోని ఉన్నత పదవిలో పుష్కరకాలానికి పైగా కొనసాగడం దుస్సాధ్యమైన పరిస్థితులు. ప్రణాళిక రూపొందించేవారే ప్రాజెక్టు పూర్తయ్యేవరకు కొనసాగే అవకాశం లేని విధానాలు. ఇలాంటి పరిస్థితులకు ఎదురీది, మేఘపథాన్ని సృష్టించిన యోధుడి విజయగాథ ‘మేఘపథం’. ఎన్ని సవాళ్లెదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు అడుగేసి, ప్రజల ప్రయాణ కష్టాలను దూరం చేసేందుకు శ్రమించి, విజేతగా నిలిచిన ఎన్వీఎస్ రెడ్డి పోరాటగాథ ‘మేఘపథం’.
దేశంలోనే అత్యున్నత కెరీర్ గా పేర్కొనే సివిల్ సర్వీసెస్ ను వదులుకుని రాష్ట్ర ప్రభుత్వంలో చేరిన ఆశావాది ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాదు మహానగరంలో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు రూపొందించిన మెట్రో రైలు ప్రాజెక్టు ఆయన సృష్టే. ప్రపంచంలోని అతి పెద్ద ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో రూపొందించిన ప్రాజెక్టు ఇది. హైదరాబాదు మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో కొనసాగుతున్న ఎన్వీఎస్ రెడ్డి దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టారు.

మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు వివిధ ప్రాజెక్టులకు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. కేవలం హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు ఒక్కటే మూడు వందలకు పైగా అవార్డులు సాధించడం మేనేజింగ్ డైరెక్టర్ గా ఎన్వీఎస్ రెడ్డి పనితీరుకు, దార్శనికతకు నిదర్శనం. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ కు 1983లో ఎంపికైన ఎన్వీఎస్ రెడ్డి భారతీయ రైల్వేలో వివిధ పదవీ బాధ్యతలు నిర్వహించారు. ‘మేఘపథం’ అనే పేరుతో స్వీయ జీవితంతో పాటు మెట్రో చరిత్రను కూడా అక్షరబద్ధం చేశారాయన. చక్కటి లయతో కూడిన ఛందస్సుతో రాసిన ‘మేఘపథం’ ప్రతికూల పరిస్థితులనూ అనుకూలంగా ఎలా మల్చుకోవచ్చో ఉద్బోధిస్తుంది. ఏటికి ఎదురీదైనా చేపట్టిన పని పూర్తి చేయాలన్న ప్రేరేపణను అందిస్తుంది.
యాభై కవితాఖండికలున్నఏకవస్తు కవితాసంపుటి ‘మేఘపథం’.

మరో మూడు అనుబంధ కవితలు, ఐదు జానపదగేయాలు కూడా ఇందులో ఉన్నాయి. తొలి కవిత ‘స్వపరిచయం’ శీర్షికకు తగ్గట్టుగానే ఆయన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తుంది. ఈ కవితలో విశ్వాంతరాళంలో / అనంత జీవరాశుల్లో /కనిపించీ కనిపించని /కణజీవిని.. అనుధూళిని.. /సాధారణ మానవుణ్ని / మానవత్వమున్నవాణ్ని / మాటకు విలువిచ్చువాణ్ని అని తన పరిచయం చేసుకుంటారు ఎన్వీఎస్ రెడ్డి. బాల్యంలో, యవ్వనంలో బాధల అనుభవం తర్వాతి జీవితంలో కష్టపడేందుకు దారితీస్తుంది. పేదల బాధలను తీర్చేందుకు కృషి చేయాలన్న దృఢ నిశ్చయాన్ని ఏర్పరుస్తుంది. ఈ కవి కూడా ఇందుకు అతీతుడేమీ కాదు. చిన్ననాటి నుండే సమాజ సేవకు కార్యోన్ముఖత ఆయన కవితాపంక్తుల్లో పరోక్షంగా బయటపడుతుంది. జెఎన్ యూ బండలపై / జాగరణలొ భాగంగా/మార్క్సిజం చర్చిస్తూ /మేధావిగ ఫీలవుతూ/మేఘాలలొ విహరించా అంటారు స్వీయపరిచయంలో. ఇందులో రెండు విషయాలను ప్రస్తావించారు కవి. ఒకటి పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలన్న నిశ్చయం. రెండోది భవిష్యత్తులో చేయబోయే ‘మేఘపథ’ సృష్టికి నాందీ ప్రస్తావన.

‘బ్యూరోక్రసీ’ అనే కవితలో దేశంలో బ్యూరోక్రసీ పని చేస్తున్న తీరును విమర్శించారు ఎన్వీఎస్ రెడ్డి. తిరస్కరణ వేదంలో / తిరుగులేని తత్వజ్ఞులు/ ఒప్పంటే తప్పన్నది / వారి వేద తొలిసూత్రం అని బ్యూరోక్రసీ పాలన తీరును ఎండగడతారు. బ్యూరోక్రసీలో ప్రధాన జాఢ్యం జాప్యం. వివిధ కొర్రీలు వేసి, జాప్యానికి కారణమవుతారు కొందరు అధికారులు. ఎక్కడో ఉన్న నిబంధనను అడ్డుగా తెచ్చి, అభివృద్ధికి మోకాలడ్డు పెడతారు. ‘ఉపసచివుడు వెదికి వెదికి/మూలపడ్డ రూలునొకటి /ముచ్చటగా ఉటంకిస్తు/ అనుమతెందుకివ్వరాదొ/ విశదంగా వివరించును అంటారు కవి. ఈ సందర్భంలో సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమీషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషన్, కోర్టులు – ఈ ఐడింటిని పంచ’సి’లుగా పేర్కొంటారు కవి. ఎన్వీఎస్ రెడ్డి కవిత్వంలో భాషాప్రయోగాలు ఆకర్షిస్తాయి. ఎల్ అండ్ టి సంస్థ భూమి పూజ కు ప్రభుత్వప్రధాన కార్యదర్శి హాజరు కావడాన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనగా మాజీ మంత్రి డా. పి. శంకర్ రావు ఆరోపించారు.

ఈ ఆరోపణను ప్రస్తావిస్తూ పనులను మొదలెట్టగానె /శంకరయ్య శివాలెత్తె అంటారు ఎన్వీఎస్ రెడ్డి. ఇక్కడ శంకరునికి పర్యాయపదమైన శివుడిని పేర్కొనడంతో పాటు ‘శివాలెత్తడం’ అంటూ శంకర్ రావు ఆగ్రహానికి అక్షరరూపం కల్పించారు. ఇలాంటి ఆకర్షణీయమైన ప్రయోగాలు మరికొన్ని పంక్తుల్లోనూ కనబడతాయి. ప్రధానియే రాకుంటే /పండుగతో పని ఏమని, సికింద్రబాదు స్టేషనొద్ద/ఎటుచూచిన వంతెనలే /తూర్పు వైపు ఓలిఫెంట/దానెనుకన మెట్టుగూడ/మలుపులోన ఆలుగడ్డ /పశ్చిమాన బోయిగూడ మొదలైనవి ఇలాంటివే. ప్రసిద్ధ సామాజిక ఉద్యమ నాయకురాలు మేధా పట్కర్ ను హైదరాబాదుకు రప్పించి మెట్రో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు కొందరు. ఈ ఘటనను గుర్తుచేస్తూ మేధక్కను తొలుకొచ్చి /మేఘపథం ఆపాలని /నినాదాల ఊదరతో/మీడియాకు ఫోజులిచ్చె!! అంటారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ప్రాజెక్టు వివరాలు అందజేసిన సందర్భంలో ఆయన చేసిన ఉద్బోధను ఆకట్టుకునేలా వివరించారు ఎన్వీఎస్ రెడ్డి. నగర కాంత నగుమోముకు నగిషీలు చెక్కండని; /భాగ్యనగర భవితవ్యం/బంగారం చేయండని/ విశ్వనగర విశిష్టతను/విశ్వమంత చాటండని ముఖ్యమంత్రి చెప్పిన విషయాలను కవిత్వీకరించారు. ఆకులన్ని రాలిపోతె /ఆమని రాకుంటుందా? /శుష్కించిన చెట్లికపై /చిగురించకపోతాయా అంటూ ఆశాభావం ప్రదర్శించారు కవి.

ఈ కవితాసంపుటిలో వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టడం కూడా కనిపిస్తుంది. రక్షణమంత్రాంటోనీ/నిజాయితీకి మారుపేరు /నిర్ణయాలె తీసుకోరు అని నాటి రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోనీ పనితీరును తనదైన శైలిలో పేర్కొన్నారు కవి. వివిధ సందర్భాల్లోని ఛాయా చిత్రాలను, పత్రికా వ్యాఖ్యలను చేర్చడం మెట్రో చరిత్రను సచిత్రంగా అందజేసే కృషిలో భాగం. కవితాసంపుటిలోని వివిధ పేజీలలో చిత్రకారులు వేసిన బొమ్మలు ఈ గ్రంథానికి అదనపు ఆకర్షణ. ఈ సంపుటి యావత్తూ హైదరాబాదు నగరం మూల మూల మెట్రో రైలు నిర్మాణానికి ఎదురైన ఇబ్బందులకు చిత్రిక పడుతుంది. విమర్శించిన నోళ్లే జయజయధ్వానాలు చేయడం మెట్రో రైలును ఉపయోగిస్తోన్న ప్రస్తుత తరుణంలో చూస్తున్నాం. ఎన్వీఎస్ రెడ్డి చెప్పినట్టు దిష్టి బొమ్మ కాల్చినోళ్లె /సన్మానాల్ చేస్తామనె/వద్దన్నా వారిచ్చిరి/పూమాలలు శాలువాలు/హార్వర్డూ స్టాన్ ఫర్డూ /ఎంఐటీ, ఐఐటీల్ చెప్పని పాఠాలివి /చేయాల్సిన పఠనాలివి. నిజంగానే ఏ విద్యాలయమూ బోధించని పాఠాలివి. పాఠకులను ప్రేరేపించి, జీవనయానంలో విజయపథంలో పురోగమించేలా చేసే ఆధునిక వ్యక్తిత్వ వికాస కావ్యమిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News